నగరాన్ని వదలని వాన.. కాలనీలు, బస్తీలను ముంచెత్తిన వరద

by Disha Web Desk 4 |
నగరాన్ని వదలని వాన.. కాలనీలు, బస్తీలను ముంచెత్తిన వరద
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : భారీ వర్షం మరోమారు భాగ్యనగరాన్ని ముంచెత్తింది. దీంతో షరామామూలే అన్నట్లుగా ప్రజలు పడరాని పాట్లుపడ్డారు. నగరంలో గత ఏడాది పరిస్థితులే పునరావృతం కావడంతో వర్షాన్ని చూసి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గడచిన రెండేళ్లుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలకు చేదుఅనుభవాలు మిగిల్చాయి. అప్పటి అనుభవాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఫలితం షరామామూలే అన్నట్లుగా పరిస్థితులు మారాయి.

బుధవారం రాత్రి నుంచి ఈదురుగాలులతో మొదలైన వాన రాత్రి మొత్తం ఆగకుండా కురియడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. వర్షం ప్రభావంతో చిన్నచిన్న కాలువల్లా మొదలైన వరద నీరు ఉదృతి పెరిగి బస్తీలు, కాలనీలు, రోడ్లు చెరువులను తలపించాయి. ఫలితంగా జనజీవనం అస్థవ్యస్తమైంది. ఇండ్లు, అపార్ట్‌మెంట్లు, రోడ్లు నీటమునిగాయి. ఎక్కడ చూసినా నడుము లోతులో నీరు చేరడంతో ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న ఇండ్లలో ప్రజలు వాటిల్లో ఉండలేక, బయటకు వెళ్లలేక బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీశారు. కనీసం తాగేందుకు నీరు లేకుండా పోయింది. నగరంలో రాత్రి నుంచి సగటున 7 సెంమీ వర్షాపాతం నమోదైనట్లు వాతావరణశాఖ ప్రకటించింది.

నీట మునిగిన కాలనీలు..

ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. నాగోల్ అయ్యప్ప కాలనీలో సుమారు 800 వరకు ఇండ్లు ఉండగా కాలనీ మొత్తాన్ని వరద నీరు ముంచెత్తింది. ఎక్కడ చూసినా మొకాలు లోతు వరద నీరు వచ్చిచేరింది. ఇండ్లలోకి సైతం వరద నీరు చేరడంతో ప్రజలు తెల్లవార్లు జాగారం చేయవలసి వచ్చింది. ఇండ్లలోని టీవీలు, ఫ్రిడ్జిలు ఇతర ఎలక్ట్రిక్ ఉపకరణాలు చెడిపోయాయి. తినేందుకు ఆహారం లేకపోగా కనీసం మంచినీరు కూడా లేకుండా పోయింది. బహుళ అంతస్థుల భవనాలు ఉన్న వారు పైఅంతస్థులు వెళ్లారు. దాదాపు ఇదే పరిస్థితి చాలా కాలనీలలో చోటు చేసుకుంది. మమతానగర్ కాలనీ, సాయిరాంనగర్ కాలనీ, అయ్యప్పకాలనీలో ఇండ్లలోకి నీరు చేరి బయటకు వచ్చేపరిస్థితి లేదు. దుర్గంచెరువు పరిసర ప్రాంతాలను వరద ముంచెత్తింది.

మాదాపూర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, బంజారాహిల్స్, నదీంకాలనీలలో నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. పనుల మీద బయటకు వచ్చిన వారు కొంతమంది వర్షం నీటిని చూసి వెనక్కు వెళ్లగా తప్పనిసరి పరిస్థితులలో కొంతమంది ప్రమాదకరంగా ఉన్నవరద నీటి నుంచే ప్రయాణించారు. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించిన అవసరాల మేరకు సిబ్బంది లేకపోవడంతో వర్షం ఇబ్బందులు తప్ప లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఒకచోట కురిసింది మరోచోట కురువలేదనేలా వర్షం పడినప్పటికీ లింగోజీగూడ, సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్, కొత్తపేట, పీఅండ్ టీకాలనీ, శారదానగర్, కోదండరామ్ నగర్, వీవీ నగర్, రెడ్డి కాలనీ, చైతన్యపురి, రామంతాపూర్, అంబర్‌పేట, టోలీచౌకీ నదీంకాలనీ, గగన్‌పహాడ్, బేగంపేట్, నార్సింగి, బయోడైవర్శిటీ, చందానగర్, మెహిదీపట్నం, చాదర్‌ఘాట్, మలక్‌పేట్ తదితర ప్రాంతాలలో ప్రభావం అధికంగా ఉంది.

సెల్లార్లను ముంచెత్తిన వరద..

నగరంలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అనేక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. సరూర్‌నగర్ చెరువు అలుగు ఉదృతంగా పోస్తుండడంతో ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని అనేక కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి. చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, టోలిచౌకీ, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, కోఠి, ఎంజే మార్కెట్ తదితర ప్రాంతాలలో వర్షం నీరు సెల్లార్‌లను ముంచెత్తింది. విద్యుత్, ఇంటర్నెట్, టెలీఫోన్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది.

కూలిన చెట్లు, ఇళ్లు..

భారీ వర్షానికి కవాడిగూడ బండమైసమ్మ నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో ఓ రేకుల ఇల్లు కూలిపోయింది. రేకులు పడిపోతుండగా ఇంట్లో నివాసం ఉండే ముగ్గురు చిన్నారులు బయటకు పరుగులు తీశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఇల్లు పైభాగం కూలిపోవడంతో కుటుంబం రోడ్డునపడింది. ఇదిలా ఉండగా ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలకు సెక్రటేరియట్ సమీపంలో ఉన్న బీఆర్‌కే భవన్ రోడ్డులో భారీవృక్షం నేలకు వరిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వేంటనే అక్కడికి చేరుకుని భారీ వృక్షాన్ని తొలగించారు. నాంపల్లిలోని పటేల్ నగర్ సాయికృప అపార్ట్మెంట్ సమీపంలోని కొబ్బరిచెట్టు కూలి అపార్ట్‌మెంట్ పై పడడంతో భవనం స్వల్పంగా దెబ్బతింది. జీహెచ్ఎంసీ సిబ్బంది కూలిన కొబ్బరి చెట్టును తొలగించారు.

Next Story

Most Viewed