- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎవరి జోన్ పరిధిలో వారికే పోస్టింగ్స్ ఇవ్వాలి: కేసీఆర్‌కు TPSA లేఖ
రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం టీపీఎస్ఏ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి పి. మధుసూదన్ రెడ్డి, ఎ. రమేష్‌లు కమిటీ తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఫీల్డ్ అసిస్టెంట్‌లను తిరిగి నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పంచాయతీ వ్యవస్థను పటిష్ట పరిచే విధంగా సమస్యలు పరిష్కరించాలన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రొబేషన్ కాలాన్ని 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు పెంచారని, కావున ఏప్రిల్‌లో వారి కాల పరిమితి పూర్తి అవుతున్నందున వారిని వెంటనే రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగలరని కోరారు.
జీవో 317 ద్వారా కొంతమంది పంచాయతీ కార్యదర్శులు స్థానికత కోల్పోయరని, గత సంవత్సర కాలంగా కుటుంబాలకు దూరమై అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. జీవోను వెంటనే సవరిస్తూ కొత్త జోన్ల క్యాడర్ స్ట్రెంత్ కేటాయించాలని, ఎవరి జోన్ పరిధిలో వారికి తిరిగి పోస్టింగులు ఇవ్వాలని పేర్కొన్నారు. 13 జిల్లాలకు సంబంధించిన స్పౌజ్ కేసులకు, బదిలీ అవకాశాలు కల్పించాలన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు క్లస్టర్ విధానాన్ని సవరిస్తూ ప్రస్తుతం ఉన్న సర్వీస్ రూల్స్ ప్రకారంగా నాలుగు గ్రేడ్లు అదే విధముగా కొనసాగించాలని వారు తెలిపారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖలో ఉన్న స్టాఫింగ్ పాటర్న్ విధానాన్ని గ్రామ పంచాయితీలకు వర్తింపచేయాలని, ప్రస్తుతం పని చేస్తున్న బిల్ కలెక్టర్లను, కంప్యూటర్ ఆపరేటర్లకు, పారిశుద్ధ్య సిబ్బందికి పే స్కేల్ వర్తింపజేయాలని పేర్కొన్నారు. పంచాయితీ కార్యదర్శుల సేవలను గుర్తిస్తూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎంకు లేఖలో కోరారు.






