‘గ్రిడ్’ పేరుతో గత సర్కార్ భూదందా..! భారీగా ఇండస్డ్రీ ల్యాండ్ కన్వర్షన్స్

by Kema Shiva Kumar |

హైదరాబాద్ గ్రిడ్ పాలసీ పేరుతో గులాబీ పార్టీకి చెందిన కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, బినామీలు పెద్ద ఎత్తున భూ దందాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.

‘గ్రిడ్’ పేరుతో గత సర్కార్ భూదందా..! భారీగా ఇండస్డ్రీ ల్యాండ్ కన్వర్షన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ గ్రిడ్ పాలసీ పేరుతో గులాబీ పార్టీకి చెందిన కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, బినామీలు పెద్ద ఎత్తున భూ దందాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇండస్ట్రీ ఏరియాలోని భూ యజమానులతో ఒప్పందాలు చేసుకుని హైరైజ్డ్ బిల్డింగ్స్ నిర్మించి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ దందాలో భాగస్వామ్యం ఉన్న వ్యక్తుల వివరాలను ఆరా తీసి బహిర్గతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే, అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఇండస్ట్రీయల్ ఏరియాల్లోని భూములకు ఫ్రీ హోల్డ్స్ రైట్స్ ఇస్తూ జీవోలు విడుదల చేసింది. ఆ టైమ్‌లో కొందరు గులాబీ లీడర్లు ప్రయోజనం పొందినట్లు విమర్శలు ఉన్నాయి. ఆ వివరాలను సైతం వెల్లడించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.

కాసులు కురిపించిన డీ సపరేషన్ పాలసీ..

హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు వెస్ట్రన్ కారిడర్ (మాదాపూర్, కొండాపూర్, కోకాపేట్, అమీన్‌పూర్, కూకట్ పల్లి)లో మాత్రమే ఉండేవి. మిగతా ఏరియాల్లో ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాలు అందుబాటులో లేవు. అందుకని కోర్ సిటీలో ఉన్న ఇండస్ట్రీ ఏరియాల్లో సైతం ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ గ్రిడ్ పాలసీ(గ్రోత్ ఇన్ డిసపరేషన్) తీసుకొచ్చారు. అప్పటివరకు అక్కడ కొనసాగుతోన్న పరిశ్రమలను అవుట్ రింగ్ రోడ్డుకు దగ్గర్లో తరలించేందుకు అవకాశం కల్పించింది. దీనితో ఆ ఖాళీస్థలంలో అ ఐటీ కంపెనీలకు కావాల్సిన విధంగా నిర్మాణాలు ఏర్పాటు చేయడంతో పాటు కమర్షియల్, రెసిడెన్షియల్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వడంతో గులాబీ లీడర్లు, వారి బంధువులు, బినామీలు రంగంలోకి దిగారు. ఇండస్ట్రియల్ ఏరియాల్లోని యజమానుల వద్ద భూములను కొనుగోలు చేయడం లేదా ఒప్పందాలు చేసుకుని హైరేంజ్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ (25 నుంచి 30 అంతస్థులు) దందాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్రిడ్ పాలసీ పేరుతో దాదాపు 450 ఎకరాల భూమి హక్కులు ఇతరుల చేతుల్లోకి వెళ్లినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

మెజార్టీ భూములు వారి చేతుల్లోనే..

గ్రిడ్ పాలసీ ద్వారా నగరంలోని కూకట్ పల్లి, గాంధీనగర్, బాలానగర్, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, మౌలాలి, పటాన్ చెరు, రామకృష్ణపురం, సనత్ నగర్, కాటేదాన్ ఇండస్ట్రీ ఏరియాల్లో ఐటీ పార్కులు ఏర్పాటు చేసేందుకు వెసులుబాటు ఏర్పడింది. ఈ పాలసీ ద్వారా భూ యజమానుల కన్నా గులాబీ లీడర్లు అధికంగా ప్రయోజనం పొందినట్లు విమర్శలున్నాయి. నాడు అధికారంలో ఉండటంతో లాండ్ ఓనర్లతో బేరసారాలు చేసుకోవడం సులువైంది. భూములు తమ పేర్ల మీదకు రాగానే అక్కడ హైరైజ్డ్ బిల్డింగ్ నిర్మాణాలకు కావాల్సిన అనుమతులు తీసుకున్నారు. కొందరైతే ఓనర్లతో ఒప్పందాలు చేసుకుని ఇప్పటికీ నిర్మాణాలు కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

రహస్యంగా జీవోలు విడుదల

2023 అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలల ముందు పరిశ్రమల శాఖ మూడు జీవోలను రహస్యంగా విడుదల చేసింది. 29 ఆగస్టు 2023లో ఒకేరోజు మూడు జీవోలు ఇచ్చింది. కానీ వాటిని పబ్లిక్ డొమైన్‌లో పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో బాలానగర్ ఇండస్ట్రీ ఏరియాలోని 30 ఎకరాలు, అజామాబాద్‌లోని 136 ఎకరాలు, హఫీజ్‌పేట్‌లోని 14.32 ఎకరాల భూములకు ఫ్రీ హోల్డ్ రైట్స్ కల్పిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హక్కులు ఇచ్చే సమయానికి లీజుదారుడి చేతులో భూమి ఉంటే 100 శాతం, మరొకరి చేతులో ఉంటే 200 శాతం ప్రభుత్వ ధరను చెల్లిస్తే హక్కులు వర్తిస్తాయి. ఈ ఫ్రీ హోల్డ్‌ రైట్స్ వెనుక గులాబీ పార్టీకి చెందిన కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, వారి బినామీలు భారీ స్థాయిలో లబ్ధి పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫ్రీ హోల్డ్ రైట్స్ స్కీం అమల్లోకి వస్తుందనే విషయాన్ని ముందుగా గ్రహించి, లీజుదారుల దగ్గర సబ్‌లీజుకు తీసుకుని భూ హక్కులు పొందినట్లు ప్రచారం జరుగుతున్నది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మళ్లీ దక్కకపోవడంతో గులాబీ లీడర్ల ప్లాన్ బెడిసి కొట్టిందనే చర్చ ఉంది.

అసలు గుట్టు విప్పుతాం: డిప్యూటీ సీఎం భట్టి

- బీఆర్ఎస్ నేతలు వారికి కావలసిన వారి కోసం, వ్యక్తుల కోసం ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ చేశారు. అంతర్లీనంగా ఎంపిక చేసిన కొద్దిమందికే చేశారు. పాలసీ లేదు. కేబినెట్ అనుమతి సైతం లేదు. ఇండస్ట్రియల్ పార్కులో కావలసిన వారికి భూములను కన్వర్ట్ చేశారు. ఎవరు ఎక్కడ లబ్డి పొందారో ఆ వ్యక్తుల వివరాలను త్వరలో బహిర్గతం చేస్తాం.

- గ్రిడ్ పాలసీ ద్వారా బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్‌కు చెందిన ఓ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు దాదాపు 8 ఎకరాల భూమి ఉంది. ఆయన త్వరలో అక్కడ హైరైజ్డ్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

-ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు కూకట్ పల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో 5 ఎకరాల స్థలం ఉంది

- కాటేదాన్ ఇండస్ట్రీ ఏరియాలోని ఆరాంఘర్ సమీపంలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఓ హై‌రైజ్డ్ కన్ స్ట్రక్షన్ బీఆర్ఎస్ నేత కనుసన్నల్లో కొనసాగుతున్నది. పక్కనే ఉన్న చెరువును కబ్జా చేసి నిర్మాణం కొనసాగిస్తునట్లు విమర్శలున్నాయి.

- మౌలాలి ఏరియాలోని 8 ఎకరాల్లో బీఆర్ఎస్‌కు చెందిన ఓ మాజీ మంత్రి హై రైజ్డ్ నిర్మాణాలకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

Next Story