భూ భారతి స్ఫూర్తితోనే విధి విధానాలు : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

by Muthe.Rajitha |   (  Updated:2025-02-18 12:45:14  IST  )

ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీలో డ్రాఫ్ట్ బిల్లు పెట్టి.. ఆ త‌ర్వాత మేధావులు, రాజ‌కీయ పార్టీల ప్రతినిధుల స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకొని దేశానికి ఆద‌ర్శంగా ఉండేలా భూ భార‌తి ఆర్వోఆర్ 2025 చట్టాన్ని తీసుకొచ్చామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు.

భూ భారతి స్ఫూర్తితోనే విధి విధానాలు : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీలో డ్రాఫ్ట్ బిల్లు పెట్టి.. ఆ త‌ర్వాత మేధావులు, రాజ‌కీయ పార్టీల ప్రతినిధుల స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకొని దేశానికి ఆద‌ర్శంగా ఉండేలా భూ భార‌తి ఆర్వోఆర్ 2025 చట్టాన్ని తీసుకొచ్చామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. అదే స్ఫూర్తితో ఈ చట్టానికి సంబంధించిన విధి విధానాల‌ను రూపొందిస్తున్నామ‌ని ప్రకటించారు. తెలంగాణ‌ ప్రజ‌ల ఆశ‌లు ఆకాంక్షల‌కు అనుగుణంగా, ప్రజానీకానికి మెరుగైన‌, స‌మ‌గ్రమైన రెవెన్యూ సేవ‌లను స‌త్వర‌మే అందించాల‌న్న ఆశ‌యంతో, విస్తృత స్థాయిలో అభిప్రాయాలను సేకరించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా భూ భార‌తి చ‌ట్టాన్ని తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. మంగళవారం భూ భారతి చట్టానికి సంబంధించి విధి విధానాలను రూపొందించడానికి ఎంసీఆర్హెచ్ఆర్డీలో క‌లెక్టర్లు, ఉన్నతాధికారుల‌తో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ భార‌తి చ‌ట్టం రూప‌క‌ల్పన‌కు ఎంత క‌ష్టప‌డ్డామో, ఈ చ‌ట్టానికి సంబంధించిన విధి విధానాల‌ను త‌యారు చేయ‌డానికి అదే స్థాయిలో క‌స‌ర‌త్తు చేయాల‌ని అధికారుల‌ను కోరారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేలా చిన్న, చిన్న తప్పులకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా విధి విధానాలను రూపొందించాల‌ని సూచించారు. ఎలాంటి విధి విధానాలు త‌యారు చేయ‌కుండానే 2020 ఆర్వోఆర్ చ‌ట్టాన్ని ఆనాటి ప్రభుత్వం అమలులోకి తీసుకురావ‌డంతో ఎదురైన ప్రతికూల ప‌రిస్ధితులు మ‌న క‌ండ్ల ముందే క‌నిపిస్తున్నాయి. ఆనాటి పాలకులు గొప్పగా చెప్పుకున్న ధరణిలో అన్ని లొసుగులు, లోపాలేనన్నారు. నిబంధ‌న‌ల రూప‌క‌ల్పన లేకుండానే అమ‌లులోకి తీసుకువ‌చ్చిన 2020 ఆర్‌ఓ‌ఆర్ చ‌ట్టం వ‌ల్లే ల‌క్షలాది మంది రైతులు రోడ్డున ప‌డ్డారు. చ‌ట్టం తీసుకువచ్చి మూడు సంవత్సరాలు గ‌డ‌చినా కూడా ఆనాటి ప్రభుత్వం విధివిధానాల‌ను రూపొందించ‌కపోయిందని విమర్శించారు.

స‌చివాల‌యంలో కూర్చొని రూల్స్ ఫ్రేమ్ చేయకుండా విస్తృత స్దాయిలో అధికారులు, మేధావులు, అనుభ‌వ‌జ్ఞుల స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకొని అంద‌రి అభిప్రాయాల‌ను క్రోడీక‌రించి ప‌క‌డ్బందీగా భూ భార‌తి విధివిధానాలు త‌యారు చేస్తున్నామన్నారు. వీలైనంత త్వరగా భూభార‌తి చ‌ట్టానికి సంబంధించిన విధివిధానాల‌ను త‌యారు చేసి చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకువస్తామన్నారు. కొత్త స‌మ‌స్యలు రాకుండా, ఉన్న స‌మ‌స్యలు ప‌రిష్కారం అయ్యేలా, రైతుల‌కు ప్రయోజ‌నం కలిగేలా, అధికారులు త‌ప్పు చేయ‌డానికి ఆస్కారం లేకుండా విధి విధానాల‌ను రూపొందిస్తున్నామన్నారు. తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం భూభారతి భూ పరిపాలనలో పెను మార్పులను తీసుకురాబోతుందన్నారు. భూ హ‌క్కుల‌ను ర‌క్షించ‌డం, భూ వ్యవ‌హారాల‌లో పార‌ద‌ర్శక‌త తీసుకురావ‌డం, భూ లావాదేవీల‌ను సుల‌భ‌త‌రం చేయ‌డం, సామాన్యుల‌కు సైతం రెవెన్యూ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం ఈ చ‌ట్టం ప్రధాన ల‌క్ష్యంగా చెప్పారు.

ఈ చ‌ట్టం త‌ర‌త‌రాల భూ స‌మ‌స్యల‌కు శాశ్వత ప‌రిష్కారం చూపుతుందన్నారు. భ‌విష్యత్తులో మ‌రింత మెరుగైన విధానాలు, సాంకేతిక‌త‌ను ఉప‌యోగించుకొని భూ ప‌రిపాల‌న‌ను మ‌రింత స‌మ‌ర్దవంతంగా కొన‌సాగిస్తామన్నారు. ఈ నూత‌న చ‌ట్టం ద్వారా భూ యాజ‌మాన్య హ‌క్కుల‌నే గాకుండా వారి జీవితాల‌ను, ఆత్మగౌర‌వాన్ని ఆర్ధిక స్వతంత్య్రాన్ని తీసుకువ‌స్తుందన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, సీసీఎల్ఏ సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ మంద మకరంద్, భూచట్టాల నిపుణులు భూమి సునిల్, సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.లచ్చిరెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లు వివిధ జిల్లాల ఆర్‌ర్డీలు, తహశీల్దార్లు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Next Story