ఉత్తమంగా పనిచేస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచాలి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-17 16:37:01  IST  )

పోలీసు సిబ్బంది ఎవరికివారు ఉత్తమ సేవలందించినట్లయితే పోలీస్ శాఖ ప్రతిష్ట పెరుగుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో రాష్ట్ర డిజిపి శనివారం సమావేశం అయ్యారు.

ఉత్తమంగా పనిచేస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచాలి
X
  • పోలీస్ సిబ్బందికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ పిలుపు

దిశ, తెలంగాణ బ్యూరో : పోలీసు సిబ్బంది ఎవరికివారు ఉత్తమ సేవలందించినట్లయితే పోలీస్ శాఖ ప్రతిష్ట పెరుగుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో రాష్ట్ర డిజిపి శనివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో మాట్లాడుతూ పోలీసు సిబ్బంది శిక్షణలో నేర్చుకున్న చట్టాలను తప్పనిసరిగా అమలు చేస్తూ తమకు తాము ఎదగాలని సూచించారు. తద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ట పెరుగుతుందని అంటూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ కు దేశంలో మంచి పేరు ఉందని ఆ పేరు నిలుపుకునేందుకు పోలీస్ సిబ్బంది పనిచేయాలని సూచించారు.

ముఖ్యంగా నాలుగు అంశాల్లో దృష్టి పెట్టడం ద్వారా సిబ్బంది పోలీస్ శాఖలో ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చునన్నారు. ప్రజలకు పోలీస్ సేవలు అందించడం, ఉత్తమ సేవలు కల్పించడం, మెరుగైన సేవలను కొనసాగించడం, పోలీస్ సేవలను అత్యుత్తమ స్థాయిలో ప్రదర్శించడం ఈ నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ సిబ్బంది పనిచేయడం ద్వారా ప్రజల అభిమానాన్ని పొందవచ్చు అని తన అనుభవాలను వివరించారు. బ్రిటిష్ కాలంలో ప్రారంభమైన పోలీసింగ్ కు 165 సంవత్సరాలు పూర్తయ్యాయని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత పోలీసు సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఆ దిశగా కృషి చేయాలని తద్వారా ప్రజలతో పాటు సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా పోలీస్ అధికారులను చూసి గర్వపడతారని డాక్టర్ జితేందర్ అన్నారు. ప్రజలలో పోలీసు విధుల పట్ల అవగాహన పెరిగిందని దానికి అనుగుణంగా సిబ్బంది పనిచేయాలని సూచించారు.

క్రిమినల్ జస్టిస్ సిస్టం ప్రకారం నేరం చేసే వారికి శిక్ష పడే విధంగా పనిచేయాలని ఆ విధంగా నేరాలు అరికట్ట వచ్చని, సాంకేతికతతో పాటు ఇతర ఆధారాలను వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ విధులలో భాగంగా ఇతర దేశాలకు పర్యటించినప్పుడు న్యూయార్క్ పోలీసు భవనాన్ని చూసినప్పుడు తమ రాష్ట్రానికి కూడా న్యూయార్క్ పోలీసులు వచ్చే విధంగా పనిచేయాలని అనుకున్నానని, కమాండ్ కంట్రోల్ సెంటర్ కు న్యూయార్క్ పోలీసులు వచ్చి తాను అన్న మాటలు గుర్తు చేశారని, తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేయడం గర్వించదగ్గ విషయమని డిజిపి డాక్టర్ జితేందర్ అన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ల తో జరిగిన ఈ సమావేశంలో శాంతిభద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలను ఉత్పత్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతల ఏఐజి రమణ కుమార్, డిఎస్.పి సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

Next Story