- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీసీబీలో కొనసాగుతోన్న అంతర్యుద్ధం.. ఇంజినీర్లు Vs సైంటిస్టులు
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB)లో కోల్డ్ వార్ నడుస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB)లో కోల్డ్ వార్ నడుస్తోంది. పర్యావరణ ఇంజినీర్లు, సైంటిస్టుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. తమకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, గుర్తింపు లేకుండా చేస్తున్నారని, తమ సమస్యలు పరిష్కరించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ వార్ చాలా కాలంగా సాగుతున్నదని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. తీవ్ర స్థాయి చేరడంతోనే మంత్రి వద్దకు చేరిందని పలువురు ఎన్జీవోలు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సైంటిస్టులు సగం మందినే
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో సైంటిస్టులు సగం మందినే ఉన్నారు. వీళ్లకంటే ఇంజినీర్లే మెజార్టీగా ఉన్నారు. సనత్ నగర్‌లోని హెడ్ ఆఫీసుతోపాటు హైదరాబాద్, రామచంద్రపురంలో రెండు జోనల్ ఆఫీసులు ఉన్నాయి. వీటితోపాటు హైదరాబాద్‌లోని నాంపల్లి, రంగారెడ్డి-1, రంగారెడ్డి-2, వరంగల్, రామగుండం, కొత్తగుడెం, సంగారెడ్డి-1, సంగారెడ్డి-2, నల్గొండ, నిజామాబాద్ మొత్తం 10 రీజినల్ కార్యాలయాలు ఉన్నాయి. ఇవికాకుండా హైదరాబాద్‌లో సెంట్రల్ లాబోరేటరీ, వరంగల్‌లో జోనల్ ల్యాబ్ ఉన్నాయి. వీటిల్లో మొత్తం 64 మంది పర్యావరణ ఇంజినీర్లు ఉంటే 38 మంది మాత్రమే సైంటిస్టులు ఉన్నారు. తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ ల్యాబ్, వరంగల్‌లో జోనల్ ల్యాబ్ మాత్రమే ఉంది. హైదరాబాద్‌లోని సెంట్రల్ ల్యాబ్‌లో 19 మంది సైంటిస్టులు ఉన్నారు. జోనల్ ల్యాబ్‌లో ఆరుగురు ఉన్నారు. రీజినల్ ల్యాబ్ లేనేలేవు. దీంతో సైంటిస్టులు అవసరంలేకుండా పోయింది.
ఇంజినీర్ల పాత్ర
పీసీబీలో పర్యావరణ ఇంజినీర్ల పాత్ర కూడా కీలకమే. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పలువురు ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ ఇంజినీర్లు వ్యర్థ జలాల శుద్ధి వ్యవస్థలు, గాలి కాలుష్య నియంత్రణ పద్ధతులు, పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ, ప్రమాదకర వ్యర్థాల పారవేత వంటి వాటిపై పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ప్రాజెక్టులు, పరిశ్రమలు పనిచేసేలా చూసి, పర్యావరణ సమతుల్యతను కాపాడటమే వీరి ప్రధాన లక్ష్యమని పలువురు సీనియర్ ఇంజినీర్లు చెబుతున్నారు. మురుగునీటి శుద్ధి, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య కారకాలను నియంత్రించడానికి సమర్థవంతమైన వ్యవస్థలను రూపకల్పన చేయాల్సి ఉంటుంది. గాలి, నీరు, భూమి కాలుష్యానికి కారణమయ్యే సమస్యలపై పరిశోధన చేసి, నివారణ చర్యలు చేపడతారు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్, పరిశ్రమ ప్రారంభించే ముందు, పర్యావరణంపై దాని ప్రభావాన్ని అంచనా వేసి, తగిన అనుమతులు జారీచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నియమాలను, అంతర్జాతీయ ప్రమాణాలను పరిశ్రమలు పాటించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మరో ఇంజినీర్ చెప్పారు.
ఎన్జీటీ, సీపీసీబీ నిబంధనలు
కాలుష్య నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, అందులో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో లాబోరేటరీలు, సైంటిస్టుల సంఖ్యను పెంచుకోవాలని, ఇంజినీర్ల సంఖ్యకు సమానంగా సైంటిస్టులను నియమించుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) ఇటీవల రాష్ట్రాలను ఆదేశించాయి. కానీ, ఈ ఆదేశాలను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అందుకు కొత్త పోస్టుల ప్రతిపాదనలే నిదర్శనం.
రంగంలోకి మంత్రి
పీసీబీలో జరుగుతున్న తతంగంపై వారం రోజుల క్రితం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ల్యాబ్‌ల సంఖ్యతోపాటు సైంటిస్టుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిసింది. అయితే పీసీబీలో ఇంజినీర్లు, సైంటిస్టుల మధ్య గొడవ గురించి ఓ సీనియర్ అధికారిని సంప్రదిస్తే ‘పీసీబీలో ఎలాంటి గొడవల్లేవు. సైంటిస్టులకు సంబంధించిన క్రెడెన్షియల్ లాగిన్స్ ఇవ్వాలని నిర్ణయించాం. దీనికి చర్యలు తీసుకుంటున్నాం’ అని సమాధానమిచ్చారు. మరో అధికారిని అడిగితే ‘ఈ విషయాలన్ని మీకెందుకు’ అంటూ మరో అధికారిని సంప్రదించాలని సూచించారు.
కోల్డ్ వార్.. ఇక్కడే..
పీసీబీలో సైంటిస్టుల కన్నా ఇంజినీర్లే మెజార్టీగా ఉన్నారు. దీంతోపాటు సైంటిస్టులు గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఉన్నారు. అయినా ఇంజినీర్ల ఆధీనంలో పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారాల విషయంలో వివక్ష కొనసాగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ప్రతిపాదించిన 42 కొత్త పోస్టుల్లో కేవలం 8 పోస్టులు మాత్రమే సైంటిస్టులకు కేటాయించి, మిగతావి ఇంజినీరింగ్ పోస్టులుగా ప్రతిపాదించారు. రాష్ట్రంలో రెండే జోనల్ ఆఫీసులు ఉండడంతో వాటిని పెంచాలని పీసీబీ నిర్ణయించింది. వీటితోపాటు రీజినల్ ఆఫీసులను పెంచాలని నిర్ణయించారు. అయితే వీటికి కావాల్సిన ఇంజినీర్లను పరిగణనలోకి తీసుకున్నారని, జోనల్ స్థాయిలో ల్యాబ్‌లను పరిగణనలోకి తీసుకోకుండా సైంటిస్టు పోస్టులకు ఎగనామం పెట్టారని ఆరోపిస్తున్నారు. దీంతోపాటు పరిశ్రమల తనిఖీల్లో నమూనాల సేకరణ, పర్మిషన్ల వంటి కీలక విధులకు సైతం సైంటిస్టులను పక్కనపెట్టి ఇంజినీర్లే కాన్నిచేస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. పర్యావరణ పరిరక్షణలో సైంటిస్టుల పాత్ర కీలకమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.






