- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యంత్రాల వాడకంతో సింగరేణిలో భారీగా తగ్గిన కార్మికుల సంఖ్య
సింగరేణిలో భారీ యంత్రాల వాడకం పెరగడంతో కార్మికుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది.

దిశ, తెలంగాణ బ్యూరో : కార్మిక శక్తికి, హక్కుల పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)లో ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఒకప్పుడు వేలమంది కార్మికుల కోలాహలంతో, నిరంతరం రణగొణ ధ్వనులతో మార్మోగే గనులు ఇప్పుడు యంత్రాల మయం అవుతున్నాయి. బొగ్గు ఉత్పత్తి ఏటికేడూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నప్పటికీ, ఆ బొగ్గును వెలికితీసే కార్మికుల సంఖ్య మాత్రం దారుణంగా పడిపోతోందని సంస్థ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లాభాల వేటలో యాంత్రీకరణకు పెద్దపీట వేస్తున్న యాజమాన్యం మానవ వనరుల పట్ల మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిటైర్మెంట్ల పేరుతో వెళ్తున్న వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడం వల్ల సింగరేణి గనుల్లో వారసత్వ ఉద్యోగాల ఆశలు అడుగంటుతున్నాయి.
లక్ష నుంచి 40 వేలకు పరిమితం..
సింగరేణిలో ఒకప్పుడు లక్షకు పైగా ఉన్న కార్మిక శక్తి కాలక్రమేణా సగానికి పైగా హరించుకుపోయింది. ఏప్రిల్ 2000 నాటికి సంస్థలో మొత్తం 1,05,627 మంది ఉద్యోగులు, కార్మికులు ఉండగా, గత మే 2026 నాటికి ఆ సంఖ్య కేవలం 40,136 కి పరిమితమైంది. అంటే గత 26 ఏళ్లలో దాదాపు 65 వేల మందికి పైగా సిబ్బంది తగ్గడం గమనార్హం. ప్రస్తుతం అధికారుల సంఖ్య 2,339 గా ఉండగా, నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ (ఎన్సీడబ్ల్యూఏ) కిందికి వచ్చే కార్మికుల సంఖ్య 37,797కి పడిపోయింది. రిటైర్మెంట్ ఎక్కువగా ఉండటం, కొత్త నియామకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని సంస్థ చెబుతున్నా, ఇది పక్కా ప్రణాళికాబద్ధమైన కుదింపు అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
భూగర్భ గనుల సంఖ్య కుదింపు..
సింగరేణిలో మానవ వనరులు తగ్గిపోవడానికి ప్రధాన కారణం కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే భూగర్భ (యూజీ) గనులు వేగంగా మూతపడటమేనని సింగరేణి వర్గాలు చెబుతున్నాయి. 2015లో సంస్థ పరిధిలో మొత్తం 48 గనులు (32 భూగర్భ, 16 ఓపెన్ కాస్ట్) ఉండగా, 2026 నాటికి మొత్తం గనుల సంఖ్య 37 కు పడిపోయింది. ప్రస్తుతం ఇందులో 21 భూగర్భ గనులు, 16 ఓపెన్ కాస్ట్ గనులు మాత్రమే నడుస్తున్నాయి. అంటే పదేళ్లలోనే 11 భూగర్భ గనులు మూతపడ్డాయి. ఓపెన్ కాస్ట్ (ఓసీ) గనుల్లో మానవ శ్రమ తక్కువ, భారీ యంత్రాల వాడకం ఎక్కువ కావడంతో మేనేజ్‌మెంట్ కొత్త నియామకాలు చేపట్టకుండా కార్మిక సంఖ్యను తగ్గించేస్తోంది. ఫలితంగా ఉత్పత్తి పెరుగుతున్నా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు మాత్రం పూర్తిగా సన్నగిల్లుతున్నాయి.






