తెలంగాణలో కోటి దాటిన రేషన్ కార్డుల సంఖ్య.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 91.68 లక్షలే..!

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య కోటికి పైగా దాటే అవకాశం కనిపిస్తోంది. అర్హులైన పేద కుటుంబాలన్నింటికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

తెలంగాణలో కోటి దాటిన రేషన్ కార్డుల సంఖ్య.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 91.68 లక్షలే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య కోటికి పైగా దాటే అవకాశం కనిపిస్తోంది. అర్హులైన పేద కుటుంబాలన్నింటికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. నాలుగు దశలో దరఖాస్తులు స్వీకరించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 89. 90 లక్షల కార్డులు ఉండగా కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత 13 లక్షల దరఖాస్తులు స్వీకరించింది. వాటిలో సుమారు 10 లక్షల కుటుంబాలకు అర్హత ఉందని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది. కొత్త కార్డులతో కలుపుకుంటే .. కార్డుల సంఖ్య కోటికి పైగా చేరుతుంది. కొత్త కార్డులతో ప్రభుత్వంపై రూ. 180 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. కొత్తగా వచ్చని దరఖాస్తుల్లో 6 లక్షల దరఖాస్తులు పరిశీలించినట్టు సమాచారం. మిగతా వాటిని నెలాఖరులో పరిశీలించే అవకాశం ఉంది. గత పదేళ్లగా రేషన్కార్డులకు ఎలాంటి గుర్తింపు లేదు. రేవంత్ సర్కార్ డిజిటల్ కార్డు అందించేందుకు ఏర్పాట్లు చేయడంతో చాలామంది తెల్ల రేషన్ కార్డు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే నాలుగు రకాల కార్డులను పరిశీలన చేశారు. రేషన్ కార్డుపై గృహణి ఫొటో వచ్చేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో 91.68 లక్షల రేషన్ కార్డులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడు తెలంగాణాలో 91,68, 231 రేషన్ కార్డులు ఉండగా.. లబ్ధిదారుల సంఖ్య 3.38 కోట్ల ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు చాలామంది తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోవడంతో 2,46, 324 రేషన్ కార్డులను రద్దు చేశారు. ప్రస్తుతం 89.90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నారు. వాటిలో 2.7 కోట్ల లబ్ధిదారులు ఉన్నట్టు సమాచారం. తెలంగాణా రాష్ట్రం సిరీస్‌కు కొత్త ఆహార భద్రత కార్డులను అనుసంధానం చేశారు. జాతీయ ఆహార భద్రత కింద కేంద్ర ప్రభుత్వం 54 లక్షల కార్డులు అందించగా .. కోటి 91 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 35 లక్షల ఆహార భద్రతా కార్డులతో 89 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారు.

లక్ష కుటుంబాలకు డిజిటల్ కార్డులు

కొత్త రేషన్ కార్డులను బార్‌కోడ్‌తో (పాస్పోర్టు సైజులో) ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇంటి గృహాణి పేరుమీదుగా కార్డు మంజూరు చేస్తారు. కార్డుపై ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో.. మరో వైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటో.. మధ్యలో ప్రభుత్వం లోగో ఉంటుంది. కుటుంబ సభ్యుల పేర్లు, చిరుమానా, రేషన్దుకాణం నంబర్ఇతర వివరాలు నమోదు చేస్తారు.

డిజిటల్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ ఒకేసారి

రేషన్ షాపుల నుంచి సన్నబియ్యం, కొత్త డిజిటల్కార్డు పంపిణీ ఒకేసారి ప్రారంభించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ 6 లక్షల మెట్రిక్టన్నుల సన్నబియాన్ని సిద్ధం చేసింది. మరో 10 లక్షల మెట్రిక్టన్నులు సీఎంఆర్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న ధాన్యంతో 8 నెలలకు సరిపడే సన్నబియ్యం నిల్వలు ఉన్నాయి. మరో నాలుగు నెలకు సంబంధించినవి గత యాసంగి సీజన్‌కు చెందిన ధాన్యాన్ని సేకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Next Story