సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది!

by Disha Web Desk 4 |
సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సెంట్రల్ ఫండ్స్‌తో కొనసాగిస్తున్న స్కీమ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటున్నది. ముఖ్యంగా స్టేట్‌లో హెల్త్ ప్రోగ్రామ్స్, పథకాలన్నీ దాదాపుగా కేంద్ర నిధులతోనే నిర్వహిస్తున్నది. ఎన్‌హెచ్ఎం నిధులను వీటి కోసం వినియోగించుకుంటున్నది. వివిధ ఆరోగ్య పథకాలు, కార్యక్రమాల నిర్వహణ కోసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.2300 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రపోజల్స్ పెట్టింది.

ఇప్పటికే కేంద్రం రూ.1900 కోట్లు అప్రూవల్ ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కోసం కూడా నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. కంటి వెలుగుకు కూడా వచ్చే కేంద్ర ఆర్థిక బడ్జెట్లో నిధులు కోరనునున్నట్లు సెక్రటేరియట్‌లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇలా కేంద్రం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలున్నాయి.

రిక్రూట్‌మెంట్‌కు రూ.500 కోట్లు!

నేషనల్ హెల్త్ మిషన్ బడ్జెట్‌తోనే ఎక్కువ మందికి సాలరీలు ఇస్తున్నారు. ప్రస్తుతం వైద్యశాఖలోని వివిధ విభాగాల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సపోర్టెడ్ స్టాఫ్ లో మెజార్టీ ఎన్‌హెచ్ఎం పరిధిలోనే జీతాలు పొందుతున్నారు. ఇటీవల రిక్రూట్‌మెంట్ జరిగిన ఎంఎల్ హెచ్పీ స్టాఫ్‌కు కూడా ఎన్‌హెచ్ఎం బడ్జెట్ నుంచే జీతాలు చెల్లించడం గమనార్హం. ప్రతీ ఏడాది జీతాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా దాదాపు రూ.500 కోట్లను మంజూరు చేస్తున్నట్లు తెలిసింది.

ఇక మెటర్నల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, మదర్ వెల్ఫేర్‌కు ప్రతీ సంవత్సరం రూ. 250 కోట్లు, చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్యూనైజేషన్‌కు రూ. 250 కోట్లు, మాతా శిశు సంరక్షణ కేంద్రాల నిర్వహణకు రూ.250 కోట్లు, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కిట్ల పంపిణీ‌కి రూ.120 కోట్లు, మలేరియా, టీబీ నివారణకు రూ. 200 కోట్లు, ఇంటిగ్రెటెడ్ డిసీజెస్ సర్వెలెన్స్ ప్రోగ్రామ్‌కు రూ.50 కోట్లు, క్వాలిటీ అసెస్‌మెంట్‌కు రూ.250 కోట్లు, ఆర్‌బీఎస్‌కే‌కు రూ.100 కోట్లు, కంటి సర్జరీలకు రూ.50 కోట్లతో పాటు హెల్త్ ప్రొఫైల్, తదితర కార్యక్రమాలు, వివిధ స్కీమ్‌లకూ కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తున్నది.

ఆ బడ్జెట్ లేకపోతే ఖతమే

ఎన్‌హెచ్ఎం బడ్జెట్ లేకపోతే వైద్యశాఖలోని వివిధ స్కీమ్‌లు, పథకాలన్నింటికీ బ్రేకులు పడే ప్రమాదముదన్నది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో మరింత చిక్కులు వచ్చే అవకాశమున్నది. చివరకు కొందరు అధికారులు వాడే వాహనాలను కూడా ఎన్‌హెచ్ఎం బడ్జెట్ నుంచే మెయింటెనెన్స్, ఇతరత్రా ఖర్చులను వాడుతున్నట్లు తెలిసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైద్యశాఖలోని అన్ని స్కీములను సొంత బడ్జెట్‌తో చేస్తున్న రీతిలో గొప్పలు చెప్పుకుంటున్నది.

ఎన్‌హెచ్ఎం పరిధిలో కొనసాగుతున్న స్కీమ్‌లన్నీ మెజార్టీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండటంతో ఆ నిధులకు బ్రేక్ పడితే రాష్ట్ర ప్రభుత్వం ఆటంకాలను ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే నిధుల కొరతతో సతమతమవుతున్న ప్రభుత్వానికి అదనపు భారం పడుతుంది. మరోవైపు కొత్తగా మహిళల కోసం అందుబాటులోకి తీసుకురానున్న స్కీమ్ కూడా నేషనల్ హెల్త్ బడ్జెట్ నిధులతోనే అని సమాచారం. కానీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అవన్నీ తన అకౌంట్లో వేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసుకునేందుకు రెడీ అయింది.

Next Story

Most Viewed