- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిచ్చుపెట్టిన మినిస్టర్ పోస్ట్.. అన్నదమ్ముల మధ్య మాటలు బంద్
మంత్రి పదవి అంశం కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి పదవి అంశం కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వడం కష్టమని హైకమాండ్ నుంచి సంకేతాలు రావడమే అందుకు కారణమని తెలుస్తున్నది. ఇప్పటికే వెంకట్ రెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవాలంటే వెంకట్ రెడ్డిని తప్పించాల్సి ఉంటుందని, అందుకు వెంకట్ రెడ్డి ఒప్పుకోవడం కష్టమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్.. మరింత పెరుగుతున్నదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఇద్దరి మధ్య మాటలు అంతంత మాత్రమే!
ఒకప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే.. రాజకీయాల్లో ఒకే మాట, ఒకే పార్టీ, ఒకే పాలసీ అనే విధంగా ఉండేది. ఇరువురు కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎన్నికల్లో ఆర్థిక సాయం చేసేవారని టాక్ ఉండేది. రాజగోపాల్ రెడ్డినే ఆ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించేవారని జిల్లా నేతలు గుర్తు చేస్తుంటారు. అంతగా ఒకేతాటి మీద ఉన్న బ్రదర్స్ ను 2022లో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు కాస్త దూరం చేశాయి. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి 2022లో తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి, బీజేపీ తీర్థం పుచ్చుకుని, బై ఎలక్షన్ లో పోటీ చేశారు. అప్పుడు వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగారు. మునుగోడు బై ఎలక్షన్ లో తమ్ముడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి కోసం పనిచేశారు. అప్పటి నుంచే ఇరువురి మధ్య మాటలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరిన తరువాత రాజగోపాల్ రెడ్డి తన అన్న ఎన్నికల వ్యవహారాలను కూడా పట్టించుకోలేదని, తనకు కావాల్సిన వనరులను వెంకట్ రెడ్డే స్వయంగా సమకూర్చుకున్నట్లు ప్రచారం ఉంది.
గ్యాప్ పెంచుతున్న ‘మంత్రి పదవి’ అంశం
అన్న వల్లే తనకు మంత్రి పదవి దక్కడం లేదని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్లున్నా.. ఇప్పటివరకైతే ఆ విధంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. అయితే ఒకే ఫ్యామిలీకి రెండు పదవులు సరికాదు అనే అభ్యంతరాలపై స్పందిస్తూ ‘మాది ఉమ్మడి ఫ్యామిలీ కాదు. ఆయనదో ఫ్యామిలీ. నాదో ఫ్యామిలీ’ అని వివరణ ఇస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి సన్నిహితుల్లో మాత్రం వెంకట్ రెడ్డి వల్లే తమ లీడర్ కు మంత్రి పదవి రావట్లేదని చర్చించుకుంటున్నారు. అలాగే వెంకట్ రెడ్డి సైతం తమ్ముడు చేస్తున్న హాట్ కామెంట్స్ ను తప్పుపట్టడం లేదు. అయితే ఆయన సన్నిహితులు మాత్రం ‘రాజగోపాల్ వ్యవహరిస్తున్న తీరు మా లీడర్ కు ఇబ్బంది తెస్తున్నాయి’ అని ఇంటర్నల్ మీటింగ్స్ లో తప్పుపడుతున్నారు.
తగువుకు హైకమాండ్ కారణమా?
కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు సంధిస్తున్నారు. సీఎంపై పరోక్షంగా ఎటాక్ చేస్తున్నారు. అందుకు ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడమే కారణమనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డిని మంత్రి పదవి ఇస్తామని హామీతోనే కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు ఆదే విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. ‘తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి పార్టీలోకి తీసుకొచ్చారు. ఇవ్వడం, ఇవ్వకపోవడం వాళ్ల ఇష్టం’ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆయనతో పాటే పార్టీలో చేరిన వివేక్ ను కేబినెట్ లోకి తీసుకుని.. తనను పక్కన పెట్టడంతో రాజగోపాల్ లో అసహనం పెరుగుతున్నదని ఆయన సన్నిహితులు అంటున్నారు. అందుకే ఆయన కొంత కాలంగా ఘాటుగా స్పందిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే, తన పదవికి ఎసరు వస్తుందనే విషయాన్ని గ్రహించిన వెంకట్ రెడ్డి సీఎంకు క్లోజ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగానే కొన్ని రోజులుగా సీఎంను పొగడ్తలతో ముంచెత్తున్నట్లు చర్చ జరుగుతున్నది.
‘పంచాయితీ’ హైకమాండే పరిష్కరించాలి
ఈ వివాదానికి కాంగ్రెస్ హైకమాండే ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. ‘మంత్రి పదవి ఇస్తామని రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలే హామీ ఇచ్చారు. వెంకట్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్ కు అధిష్టానమే ఆదేశించింది. దీంతో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా? లేక అన్నకు నచ్చజెప్పి తమ్ముడికి చాన్స్ ఇస్తారా! ప్రత్యామ్నాయ పదవి తీసుకోమని రాజగోపాల్ రెడ్డికే సూచిస్తారా?’ అనే పంచాయితీని అధిష్టానం తీర్చాల్సి ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.






