సీఎంఆర్.. గోల్ మాల్!

by Disha Web Desk 9 |
సీఎంఆర్.. గోల్ మాల్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయంలో మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ఎఫ్ సీఐకి సకాలంలో బియ్యాన్ని అందించకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. రైస్ మిల్లులకు సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యానికి, ఎఫ్ సీఐకి తిరిగి అప్పగించిన బియ్యానికి లెక్కల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో మిల్లుల్లో ఇప్పటికే అనేకసార్లు ఎఫ్ సీఐ అధికారులతోపాటు సీబీఐ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించారు. అక్రమాలు జరుగుతున్నట్లు నిర్ధారించారు. అంతేకాకుండా చాలా మిల్లుల్లో బియ్యాన్ని ఇష్టారాజ్యంగా నిల్వ చేస్తున్నారని, టార్పాలిన్లు కూడా కప్పడం లేదని, రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తం గా ఉందని గుర్తించారు.

పెనాల్టీతో సహా వసూలుకు ఆదేశాలు

2019-20 కు సంబంధించి 48 వేల మెట్రిక్ టన్నులు, 2020-21 కు సంబంధించి 75 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు తిరిగి ఇవ్వలేదు. అనేకసార్లు గడువు పెంచి, గత మార్చి 31 వరకు అవకాశమిచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో 25 శాతం నగదు జరిమానాతో కలిపి మొత్తం బియ్యాన్ని రాబట్టాలని సివిల్ సప్లయ్ కమిషనర్ వి. అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2023-24 ఖరీఫ్ సీజన్ లోపు పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ వంద శాతం పూర్తి చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే దానిని సీరియస్ గా అమలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

అవకతవకలు

మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, రైస్ మిల్లులో సీఎంఆర్ చేయించి, టార్గెట్ కు అనుగుణంగా ఎఫ్ సీఐ గోడౌన్లకు తరలిస్తుంటుంది. అయితే మిల్లర్లు ఇక్కడే అక్రమాలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి వచ్చిన ధాన్యాన్ని ఆరునెలల్లోగా మిల్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించాలి. అయితే రెండు, మూడు సీజన్లు గడిచినా మిల్లర్లు బియ్యాన్ని ఇవ్వడం లేదు. నాణ్యమైన ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకుంటున్నట్లు తెలుస్తున్నది.

అదే సమయంలో ఎక్కువగా ఒత్తిడి తెస్తే రేషన్ బియ్యం కొని రీసైక్లింగ్‌ చేసి ఆ లోటును భర్తీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే 2020–21 యాసంగి సీజన్‌కు సంబంధించి మిర్యాలగూడలోని వజ్ర పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లు రూ.5.90 కోట్ల విలువైన బియ్యాన్ని ఎగవేయడంతో రైస్‌మిల్లు యజమానులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి కేసులు ప్రతి జిల్లాలో ఉన్నప్పటికీ అధికారుల అండతో అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాజకీయ జోక్యంతో మళ్లీ ధాన్యం సరఫరా?

2019–20లో 118 మంది మిల్లర్లు రూ.230 కోట్ల విలువైన లక్ష మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి బకాయి పడ్డారు. అయితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోగా, మరోసారి గడువు పెంచడం అనుమానాలకు తావిస్తోంది. 2020–21 లో కూడా వందల సంఖ్యలో మిల్లర్లు బకాయిలు పడగా, వారిని డిఫాల్టర్లుగా ప్రకటించి, 2021–22 సీజన్లలో ధాన్యం కేటాయింపును నిలిపివేశారు. అయితే ఆ తర్వాత రాజకీయ జోక్యంతో సదరు మిల్లులకు కూడా యధాతథంగా ధాన్యం సరఫరా చేస్తున్నారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి గణనీయంగా పెరగ్గా.. పౌరసరఫరాల శాఖ అధికారుల అండతో సాగుతున్న అడ్డగోలు వ్యవహారాలన్నింటిపై సీబీఐ ప్రాథమికంగా సమాచారం సేకరించినట్లు తెలిసింది. కాగా, ఎఫ్‌సీఐలో గతంలో పనిచేసిన ఓ అధికారి హయాంలో కూడా సీఎంఆర్‌ కోటా సేకరణ విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

494 మిల్లర్లు... 2.22 లక్షల టన్నుల బియ్యం

గత వానాకాలం 2021-22 సీఎమ్మార్‌ ఇచ్చేందుకు ఎఫ్‌సీఐ ఈ ఏడాది మార్చి 31 వరకు గడువు విధించింది. అయితే గడువు ముగిసినా 494 మంది మిల్లర్లు, 2.22 లక్షల టన్నుల బియ్యాన్ని తిరిగి ఇవ్వలేదు. దీంతో డిఫాల్ట్‌ మిల్లర్ల నుంచి 25 శాతం పెనాల్టీ వసూలు చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. ఇందులో 25 శాతం సీఎమ్మార్‌ అమౌంట్‌ను తక్షణమే చెల్లించి, మిగిలిన సీఎమ్మార్‌ ఇచ్చేందుకు గడువు అనుమతి పొందాలని పేర్కొన్నది.

సీబీఐ చేతికి ఆధారాలు..

రాష్ట్రంలో ఉన్న సుమారు 3 వేల రైస్‌ మిల్లులకు గత మూడేళ్లుగా ప్రతి సీజన్‌లో సుమారు రూ.15 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం అప్పగించి, సీఎంఆర్‌ తీసుకుంటున్నది. ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసినందుకు లేబర్‌ ఖర్చుతో సహా ప్రతి పైసా మిల్లర్లకు చెల్లిస్తున్నది. అయినా పలువురు మిల్లర్లు పౌరసరఫరాల శాఖ అధికారుల అండతో సర్కారు ధాన్యాన్ని సొంత వ్యాపారానికి వినియోగించుకుంటున్నట్టుగా ఇటీవల సీబీఐ నిర్వహించిన తనిఖీల్లో ఆధారాలు లభించినట్లు తెలిసింది.

రేషన్ బియ్యం రీ సైక్లింగ్..

సుల్తానాబాద్‌, పెద్దపల్లి, మంథని లాంటి చోట్ల పలువురు మిల్లర్లు రేషన్‌ బియ్యాన్ని మిల్లుకు చేర్చి సీఎంఆర్‌ కింద చూపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారులు తనిఖీలకు వస్తున్నారని సమాచారముంటే ధాన్యం బస్తాలను అస్తవ్యస్తంగా పడేస్తున్నారని, లెక్కలు చెప్పేందుకు ఒప్పుకోవడం లేదనే విమర్శలున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులతో ఫోన్లు చేయించి ఒత్తిడి చేయడం, వినకపోతే మభ్యపెట్టడం పరిపాటిగా మారినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మిల్లుల నుంచి ఎఫ్‌సీఐ గోదాములకు బియ్యం తరలించే వాహనాలకు ఇన్‌బిల్ట్‌ జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టం ఏర్పాటు చేయాల్సి ఉండగా, సాంకేతిక కారణాలు చూపెట్టి సరుకు నిల్వలను తారుమారు చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించినట్లు తెలిసింది.

Next Story

Most Viewed