ఎంబీఏ కాలేజీల మాయాజాలం.. ఇంటర్న్‌షిప్ లేకుండానే ఫేక్ సర్టిఫికెట్లు

by Malleboina Mahesh |

ఎంబీఏ కాలేజీల్లో ఇంటర్న్‌షిప్ లేకుండానే ఫేక్ ప్రాజెక్ట్ సర్టిఫికెట్ల దందా.. ఉస్మానియా పరిధిలోని 15 కాలేజీల్లో సీట్ల కోతకు అధికారులు సిద్ధం!

ఎంబీఏ కాలేజీల మాయాజాలం.. ఇంటర్న్‌షిప్ లేకుండానే ఫేక్ సర్టిఫికెట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మేనేజ్‌మెంట్ విద్య అందిస్తున్న ఉస్మానియా పరిధిలోని కొన్ని ఎంబీఏ కాలేజీల నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ ఇచ్చి కార్పొరేట్ రంగానికి సిద్ధం చేయాల్సిన పలు విద్యాసంస్థలు వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి. నిబంధనల ప్రకారం విద్యార్థులతో ఇంటర్న్‌షిప్ చేయించి, ప్రాజెక్టు రిపోర్టులు రూపొందించాల్సి ఉండగా.. క్షేత్రస్థాయిలో అవేమీ లేకుండానే ఫేక్ ప్రాజెక్ట్ సర్టిఫికెట్లను అందజేస్తూ మమ అనిపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రైవేట్ ఎంబీఏ కాలేజీలు విద్యార్థులను ఏ కంపెనీకీ పంపకుండా, ఎలాంటి శిక్షణ ఇప్పించకుండానే నకిలీ సర్టిఫికెట్లను పుట్టించేస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలు ఏకంగా బ్రోకర్లు, కొన్ని ఫేక్ కన్సల్టెన్సీలతో చేతులు కలిపి దందాను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. కూర్చున్న చోటే ప్రాజెక్ట్ రిపోర్టులు సిద్ధం చేసి, మార్కులు వేసేస్తూ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఆ కాలేజీల్లో సీట్ల కోత..

ఈ ఫేక్ ప్రాజెక్టుల వ్యవహారం వెనుక ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కొందరు ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. కాలేజీల తనిఖీలు, ప్రాజెక్ట్ రిపోర్టుల పరిశీలన సమయంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయని విద్యార్థి సంఘాలు మండి పడుతున్నాయి. కాలేజీల యాజమాన్యాల నుంచి అందుతున్న ముడుపుల వల్లే అధికారులు ఈ దందాను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఇటీవల ఉన్నతాధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీనిపై ఓయూ అధికారులు విచారణ జరిపినట్లు తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో, గ్రేటర్ పరిధిలోని దాదాపు 70 కాలేజీలుంటే పది నుంచి 15 కాలేజీల్లో సీట్లకు కోత విధించే అవకాశం ఉంది. చాలావరకు కాలేజీలు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, సరైన బోధనా సిబ్బంది లేకపోవడం లేకపోవడం తదితర కారణాలతో కాలేజీల్లో సీట్లకు కోత విధిస్తున్నారు. కేవలం తనిఖీల సమయంలో మాత్రమే కాలేజీల తలుపులు తెరుచుకోవడం గమనార్హం.

యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనలు : సీజేఎస్ అధ్యక్షుడు డా. మాసారం ప్రేమ్‌కుమార్

నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోకపోతే విద్యార్థుల కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఓయూ అధికారులు, కాలేజీ యాజమాన్యాల మధ్య మంచి సఖ్యత ఉంది. ఒకచోట కాలేజీకి పర్మిషన్లు తీసుకుని మరొకచోట నిర్వహిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో కాలేజీ ఫార్వడింగ్‌లదే హవా నడుస్తోంది. ఇలాంటి కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. గతేడాది నుంచి నేను ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు కాలయాపన చేస్తున్నారు.

Next Story