నకిలీ విత్తనాల ‘మాఫియా’ దందా: ఆఫర్ల పేరుతో అన్నదాతలకు ఎసరు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-01 02:00:13  IST  )

తెలంగాణలో నకిలీ విత్తనాల మాఫియా రెచ్చిపోతోంది. 12 ప్యాకెట్లు కొంటే 2 ప్యాకెట్లు ఫ్రీ అంటూ ఆఫర్లతో నిండా ముంచేస్తున్నారు.

నకిలీ విత్తనాల ‘మాఫియా’ దందా: ఆఫర్ల పేరుతో అన్నదాతలకు ఎసరు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వానాకాలం సీజన్​మొదలుకాకముందే నకిలీ విత్తనాల మాఫియా పంజా విసురుతున్నది. పత్తి, మిర్చి, వరి విత్తనాలు పెద్దమొత్తంలో పక్కరాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని గ్రామాల్లో ఎరువుల దుకాణాలు నిర్వహించే వ్యాపారుల వద్ద నిల్వలు చేస్తున్నారు. రైతులకు ఆఫర్లు ఇస్తూ హాట్​కేక్​లా అమ్ముడుపోయేలా ఎత్తులు వేస్తున్నారు. ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, నారాయణపేట, సిరిసిల్ల, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో నకిలీ విత్తనాల విక్రయాలు సాగుతున్నట్టు అధికారులు గుర్తించారు. 12 ప్యాకెట్లు ఒక రైతు కొనుగోలు చేస్తే రెండు ప్యాకెట్లు ఉచితం, పక్క రైతులకు విక్రయాలు చేయిస్తే ప్యాకెట్లు ధరలో 10 శాతం కమీషన్​ ఇస్తామని గుట్టుగా ప్రచారం చేస్తున్నారు. తొలకరి పడకముందే తమ వ్యాపారాన్ని ముగించి రూ.కోట్లు సంపాదించుకునేందుకు తంటాలు పడుతున్నారు. స్థానిక వ్యాపారులు తమ వద్ద ఎరువులు తీసుకునే రైతులకు అట్టగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో నకిలీ విత్తనాల ముఠా పోలీసుల చేతికి చిక్కింది. మార్కెట్లో పత్తిలో హెచ్​టీ (బీజీ–3) రకానికి మన దేశంలో అనుమతి లేదు. గడ్డి, పురుగు మందులను తట్టుకునే ఈ రకాన్ని సాగు చేయడంతో అధిక రసాయన మందులు చల్లి రైతులు రోగాల బారిన పడుతున్నారని గమనించి ప్రభుత్వం ఇటీవలే నిషేధం విధించింది. కానీ దిగుబడి ఎక్కువగా ఉంటుందని కొందరు గుట్టుగా ఈ రకం విత్తనాలను విక్రయిస్తున్నారు. మరికొందరు దళారులు నేరుగా విత్తనాలు విక్రయిస్తే పోలీసులకు దొరుకుతామని ఆన్​లైన్‌లో విక్రయిస్తున్నట్టు తెలిసింది.

తనిఖీలు ఎక్కడ?

విత్తనాల సరఫరా వ్యవస్థలో అనేక దశలు ఉన్నప్పటికీ సరైన తనిఖీలు జరగడం లేదు. అనుమతి లేని డీలర్లు, మధ్యవర్తులు గ్రామాలవరకు చేరి రైతులను నిండా ముంచుతున్నారు. అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి. చాలా మంది రైతులకు అసలైన విత్తనాలు, నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలో తెలియక మోసపోతున్నారు. వ్యవసాయశాఖ రైతులకు సరైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో విఫలమవుతున్నది. రైతు సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయి. రైతు ముంగిట్లలో శాస్త్రవేత్తల కార్యక్రమం ద్వారా అవగాహన చేపట్టి రైతులను అప్రమత్తం చేయాలి. నకిలీ ఆటకట్టేందుకు ప్రభుత్వం టాస్క్​ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేసినా ఆశించిన స్థాయిలో ముఠాలను గుర్తించలేకపోతున్నారు. రైతులు ఫిర్యాదులు చేస్తే తప్ప ఆ టీమ్​లు ప్రత్యేక దృష్టి పెట్టడం లేదు. ఒకవేళ నకిలీ విత్తనాలు దొరికినా మాఫియాను వదలి స్థానికంగా ఉంటే చిరు వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

జాగ్రత్తలు ఇవే..

నకిలీ విత్తనాల బారినపడకుండా ఉండటానికి వ్యవసాయ నిపుణులు, అధికారులు సూచనలు చేస్తున్నారు. గుర్తింపు పొందిన ఫర్టిలైజర్ షాపులు లేదా ప్రభుత్వ డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనాలి. విత్తనాలు కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. రసీదుపై విత్తనాల రకం, లాట్ నంబర్, గడువు తేదీ స్పష్టంగా ఉండాలి. సీల్ వేసిన ప్యాకెట్లను మాత్రమే తీసుకోవాలి. ప్యాకెట్‌పై క్యూఆర్ కోడ్ ఉంటే దానిని స్కాన్ చేసి నాణ్యతను ధ్రువీకరించుకోవాలి. ప్యాకింగ్ లేని విడి విత్తనాలు తక్కువ ధరకే వస్తున్నాయని దళారుల వద్ద విత్తనాలను కొనుగోలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. నకిలీ విత్తనాలుగా అనుమానం వస్తే వెంటనే 100 కానీ స్థానిక వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.

Next Story