- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ‘స్థానిక’ సందడి ఊపందుకుంది. మండల ప్రాదేశిక నియోజకవర్గాలు(ఎంపీటీసీలు), జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల్లో(జెడ్పీటీసీలు) ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. గత ఏడాది నుంచి గ్రామీణులు ఎదురు చూస్తున్న ఈ ఎన్నికల నిర్వహణకు ఒకపక్క రాజకీయ పక్షాలు, మరోవైపు అధికారులు మరికొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిఇలా ఉంటే .. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. గతంలోనే వార్డుల వారీగా ఓటరు జాబితాలను ప్రకటించింది. బ్యాలెట్‌పేపర్ల ముద్రణ ఇప్పటికే పూర్తిచేసినట్టు సమాచారం. పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. పంచాయతీలకు/వార్డులకు రిజర్వేషన్ కేటగిరీలను ప్రకటించిన తరువాత ఎన్నికలు నిర్వహిస్తారు.
ఎన్నికల సంఘం కసరత్తు
తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మండల ప్రాదేశిక నియోజకవర్గం వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించడం, పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయడం, ఎన్నికల సిబ్బందికి శిక్షణ తదితర పనుల్లో ఇప్పటికే నిమగ్నమైంది. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు అధికారులు ఈ ఏర్పాట్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మండల ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా..రూపొందించిన ఓటర్ల జాబితాలపై ఎన్నికల అధికారులు అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. మరికొందరు అధికారులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. ఈనెల 15 నాటికి పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాల్సి ఉంది. పోలింగ్ కేంద్రాలకు తగిన సౌకర్యాలు ఉన్నాయో లేదో అధికారులు పరిశీలించిన తరువాత కలెక్టర్‌కు తుది నివేదికను అందించనున్నారు.
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు
ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి మండలాన్ని కనీసం రెండు, మూడు క్లస్టర్‌లుగా విభజించాల్సి ఉంది. క్లస్టర్లలోనే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలనే పునరాలోచనతో అధికారులు ఉన్నారు. మండల కేంద్రం, దాని పరిసర గ్రామాలను ఒక క్లస్టర్‌గా గుర్తించే అవకాశం ఉంది. మండలంలోని ఇతర పెద్ద గ్రామాలను మరో క్లస్టర్చేయాలని భావిస్తున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఇతర శాఖల అధికారులను రిటర్నింగ్ అధికారులుగా నియమించనున్నారు.
ఆర్వోలుగా గెజిటెడ్ ఆఫీసర్లు
రిటర్నింగ్ ఆఫీసర్లుగా ..గెజిటెడ్ అధికారుల్ని నియమించడానికి కలెక్టర్‌లు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ, పంచాయతీరాజ్ఇంజనీరింగ్, నీటిపారుదల శాఖ అధికారుల సేవలను స్థానిక ఎన్నికలకు వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణకు మండలంలోని టీచర్లతోపాటు ఇతర శాఖల అధికారుల సేవలను వినియోగించుకోనున్నారు.
స్టేజీల వారీగా ఎన్నికలు
నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన వరకూ జరిగే ప్రక్రియను స్టేజ్వన్గా భావిస్తున్నారు. పోలింగ్నిర్వహణకు స్టేజ్2గా భావించి.. ఇందుకు అవసరమైన సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఇప్పటికే ఎంపీడీవోలు, ఇతర మండల స్థాయి అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. సమస్యాత్మక గ్రామాలు గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అలాంటిచోట్ల అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేయనున్నారు.






