తుది దశకు చేరిన ‘కాళేశ్వరం’ విచారణ.. నేటి నుంచి అగ్రనేతల ఎంక్వైరీ షురూ

by Kema Shiva Kumar |

కాళేశ్వరం కమిషన్​ తుది విచారణలో భాగంగా మాజీ ఆర్థిక మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం జస్టిస్​ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ ఎదుట ​హాజరుకానున్నారు.

తుది దశకు చేరిన ‘కాళేశ్వరం’ విచారణ.. నేటి నుంచి అగ్రనేతల ఎంక్వైరీ షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం కమిషన్​ తుది విచారణలో భాగంగా మాజీ ఆర్థిక మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం జస్టిస్​ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ ఎదుట ​హాజరుకానున్నారు. అదే విధంగా ఈనెల 9న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్​రావు, 11న మాజీ సీఎం కేసీఆర్.. విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు వారికి ఇప్పటికే కమిషన్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ సమయంలో ఈ ముగ్గురు కీలక బాధ్యతల్లో ఉన్నారు. దీంతో వారిని విచారించాలని కమిషన్​నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 100 మందికి పైగా అధికారులను కమిషన్ విచారించింది. వారు చెప్పిన అంశాలు, వాటికి సంబంధించిన ఆధారాల ఆధారంగా ఈ ముగ్గురిని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

విచారణ సందర్భంగా మొదటి గంట పాటు వారు ఏదైనా చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఆ తర్వాత జస్టిస్ పీసీ ఘోష్​ప్రశ్నలు అడగనున్నారు. వారిని ప్రశ్నలు అడిగే సమయంలో స్పష్టమైన ఆధారాలను వెంటబెట్టుకుని అడిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ముగ్గురిని క్రాస్​ఎగ్జామినేషన్​కాకుండా విచారణ మాత్రమే చేయనున్నారు. ఈ ముగ్గురి విచారణ లేకుండానే నివేదిక ఇవ్వాలని మొదట కమిషన్​భావించినా.. ఆ తర్వాత గతంలోని విచారణ కమిషన్​ నివేదికలను పరిశీలిస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకొని నివేదిక ఇచ్చినట్లుగా గుర్తించారు. అదే సమయంలో సహజ న్యాయ సూత్రంలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వివరణ లేకుండా కమిషన్​నివేదిక ఇస్తే ఏకపక్షం అవుతుందని, తద్వారా విమర్శలు తలెత్తే అవకాశం ఉందని కమిషన్ ఆలోచించి.. ఈ ముగ్గురికి నోటీసులు అందించినట్లు తెలిసింది. కేసీఆర్‌కు మొదట జూన్-5న హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. అయితే, తనకు ఆరోగ్యం బాలేనందున ఆ రోజు హాజరుకాలేనని కమిషన్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయనకు ఈనెల 11న హాజరయ్యే విధంగా అవకాశం కల్పించారు. వీరి విచారణ కోసం ప్రభుత్వం 2 నెలల గడువు కూడా పొడిగించింది.

Next Story