- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోరెత్తనున్న జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం.. రంగంలోకి దిగనున్న సీఎం రేవంత్!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారాన్ని అధికార కాంగ్రెస్ మరింత రక్తి కట్టించనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారాన్ని అధికార కాంగ్రెస్ మరింత రక్తి కట్టించనుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా రంగంలోకి దిగనున్నారు. ఈనెల 30 నుంచి నాలుగు రోజుల పాటు రోడ్‌షోలు నిర్వహించేలా అధికారపార్టీ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో అధిక సంఖ్యలో ఉన్న సినీకార్మికులతో భారీసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈనెల 28న పోలీస్ గ్రౌండ్స్‌లో సభకు శ్రీకారం చుట్టింది. ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. సినీరంగ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేలా గతంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్మాతలు, సినీ ప్రముఖులను కూర్చోబెట్టి ఒప్పించారు. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి ఓటు వేయాలని బహిరంగ సభ ద్వారా వారికి విజ్ఞప్తి చేయనున్నారు. సినీ కార్మికులు, ఆ నేపథ్యం కలిగిన వారి ఓట్లు ఈనియోజకవర్గంలో పది వేలకు పైగానే ఉంటాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో వారితో సభ నిర్వహించడం ద్వారా భారీ మెజార్టీ సాధించవచ్చని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.
అన్ని డివిజన్లు కవర్ అయ్యేలా రోడ్ షో..
ఈనెల 30 నుంచి నాలుగు రోజుల పాటు జూబ్లీహిల్స్‌లోని ఆయా డివిజన్లలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఈనెల 30, 31న, అలాగే వచ్చనెల4, 5వ తేదీల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. సాయంత్రం వేళ రోడ్‌షోలు ఉండేలా ప్లాన్చేస్తున్నారు. ఒక్కో డివిజన్లో ఒకటి రెండుచోట్ల ఆయన ప్రసంగించనున్నారు. అందుకోసంమంత్రులు భారీ ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నాలుగు రోజులే కాకుండా అవసరమైతే మరో రోజు సైతం సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సీఎం ప్రచారం ప్రారంభమైతే ప్రచారం మరింత వేగం పుంజుకుంటుందని, బాధ్యతలు అప్పగించిన మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత సీరియస్‌గా పనిచేస్తారని భావిస్తున్నారు. ఇద్దరు మంత్రులకు ఒక డివిజన్చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఒక్కోమంత్రికి నలుగురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్చైర్మన్లకు బాధ్యతలు అప్పగించారు. వారంతా సీరియస్ గా రంగంలోకి దిగితే కాంగ్రెస్ ఎన్నికలప్రచారం మరింత ఊపందుకుంటుందని ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్క విస్తృతంగా పర్యటిస్తున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ మరికొందరు మంత్రులు రంగంలోకి దిగనున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో గెలవాల్సిందేనని సర్వశక్తులూ ఒడ్డుతున్నది.






