జగిత్యాల జగడానికి ఫుల్ స్టాప్.. రెండు వర్గాల మధ్య కుదిరిన సయోధ్య

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-15 15:24:54  IST  )

జగిత్యాల మున్సిపాలిటీ జగడం కొలిక్కివచ్చింది. ఉప్పునిప్పుగా పోటాపోటీ రాజకీయాలు చేసిన ఎమ్మెల్యే సంజయ్, జీవన్ రెడ్డి మధ్య ఏఐసీసీ సెక్రటరీ సయోధ్య కుదిర్చారు.

జగిత్యాల జగడానికి ఫుల్ స్టాప్.. రెండు వర్గాల మధ్య కుదిరిన సయోధ్య
X
  • సయోధ్య కుదిర్చిన ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్, మంత్రి అడ్లూరి
  • ప్రజాభవన్ లో జీవన్ రెడ్డి, సంజయ్ లతో వేర్వేరుగా భేటీ
  • పార్టీ నిర్ణయానికి కట్టబడతామన్న ఇరు నేతలు
  • పార్టీ జెండా మోసిన వారికే చైర్మన్ పదవి ఇవ్వాలన్న జీవన్ రెడ్డి
  • సానుకూలంగా స్పందించిన పార్టీ పెద్దలు
  • జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
  • సీనియర్ నేతకు చైర్మన్ పదవి

దిశ, తెలంగాణ బ్యూరో : జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నెలకొన్న ప్రతిష్టంభనకు కాంగ్రెస్ పెద్దలు తెరదించారు. జగిత్యాలలో గత కొద్ది నెలలుగా ఉప్పు నిప్పుగా ఉండి పోటాపోటీ రాజకీయాలు చేసిన ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిల మధ్య కాంగ్రెస్ ముఖ్య నేతలు సయోధ్యను కుదిర్చారు. జగిత్యాలలో రెండు వర్గాలుగా విడిపోయిరన సంజయ్, జీవన్ రెడ్డి వర్గాల మధ్య రాజీ కుదుర్చాలని కాంగ్రెస్ పెద్దల సూచనల మేరకు ఆదివారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ సవాంగ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్​కుమార్ లు ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. జీవన్ రెడ్డి, సంజయ్ లతో సమావేశాలు నిర్వహించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నాలు చేసి ఇరు వర్గాల మధ్య రాజీ కుదర్చడంలో సక్సెస్ అయ్యారు. జీవన్ రెడ్డి తన మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తన వర్గం కౌన్సలర్లతో ప్రజాభవన్ కి వచ్చారు. ఏఐసీసీ కార్యదర్శితో జీవన్ రెడ్డి సుదీర్ఘంగా భేటీ అయి తన వాదనను వినిపించారు. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గం వారికి జరిగిన అన్యాయం. సంజయ్ తమ పట్ల వ్యవహారించిన తీరును వివరించినట్లుగా తెలిసింది.

తనకు కేటాయించిన 16 బీఫారాల్లో 9 మందిని గెలిపించుకున్నానని, సంజయ్‌కి ఇచ్చిన 34 బీఫారాల్లో 14 మంది మాత్రమే గెలిచారని ఆయన చెప్పారు. సంజయ్ కుమార్ టికెట్లు ఇవ్వని 9 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా గెలిచారని జీవన్ రెడ్డి వారి దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలిసింది. దీనితో జీవన్ రెడ్డి వాదన విన్న తర్వాత ఆయన వర్గానికి న్యాయం చేస్తామని, సంజయ్ ఏ పరిస్థితుల్లో పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఆయనకు న్యాయం చేయాల్సి ఉందని, ఇరువురు పార్టీకి కీలకం అయినందున ఇరు వర్గాలు ఒకరికి ఒకరు తోడ్పాటు అందించుకుంటూ వెళ్లాల్సి ఉందని చెప్పినట్లుగా తెలిసింది. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని, సీనియర్ నేతగా పార్టీలో సమస్యలను చక్కదిద్దాల్సింది పోయి.. ఇలా రోడ్డున పడటం సరికాదనీ, ఇరు వర్గాలకు న్యాయం చేసే విధంగానే తాము వ్యవహారిస్తామని చెప్పినట్లుగా సమాచారం. రెండు వర్గాలు పార్టీకి ముఖ్యమని స్పష్టం చేశారు. దీనితో పాటు మీనాక్షి నటరాజన్ కూడా జీవన్ రెడ్డితో ఫోనులో మాట్లాడినట్లు తెలిసింది. ఆమె కూడా జీవన్ రెడ్డి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిసింది. దీనితో మెత్తబడ్డ జీవన్ రెడ్డి పార్టీ ముందు రెండు ప్రతిపాదనలు పెట్టారని, పార్టీలో మొదటి నుంచి ఉండి జెండా మోసిన వారికే చైర్మన్ పదవి, ఇరు వర్గాలకు చెరి సమానంగా చైర్మన్ పదవి కాలాన్ని ఇవ్వాలని కోరినట్లుగా తెలిసింది. అనంతరం తన వర్గం వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన తర్వాత పార్టీ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని జీవన్ రెడ్డి చెప్పినట్లుగా తెలిసింది. జీవన్ రెడ్డితో సమావేశం అనంతరం ఎమ్మెల్యే సంజయ్ తో సవాంగ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్​లు భేటీ అయిన తర్వాత సంజయ్ కూడా వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడంతో జగిత్యాలలో నెలకొన్న పీఠముడి తొలిగిపోయింది. జగిత్యాల బీసీ మహిళకు రిజర్వ్ అయింది. బీసీ మహిళా రిజర్వ్ స్థానం నుంచి గెలుపొందిన కౌన్సిలర్ కి, పార్టీ సీనియర్ నేతకు చైర్మన్ పదవి దక్కబోతోంది.

పార్టీ జెండా మోసిన వారికే చైర్మన్ పదవి ఇవ్వాలి.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా : జీవన్ రెడ్డి

పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ కష్టకాలం ఉండి పార్టీ జెండా మోసిన వారికే చైర్మన్ పదవి ఇవ్వాలని, పార్టీ ఆరంభం నుంచి ఉన్న వారికి న్యాయం చేయాలని కోరినట్లుగా చెప్పారు. తన వాదనను వినిపించానని, వారు ఓపికగా విన్నారని జీవన్ రెడ్డి అన్నారు. అయినా పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన స్ఫష్టం చేశారు.

జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

జగిత్యాలలో మున్సిపల్ ఫలితాల్లో మొత్తం 50 వార్డులకు కాంగ్రెస్ 23, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2, ఇండిపెండెంట్లు 15 మంది గెలిచారు. దీనితో అక్కడ హంగ్ ఏర్పడింది. సంజయ్ తన వర్గానికి చెందిన 23 మందితో, జీవన్ రెడ్డి తన వర్గానికి చెందిన 18 మందితో క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. దీనితో ప్రతిష్టంభన ఏర్పడింది. మెజార్టీకి కావాల్సిన 26 మంది అవసరం పడటంతో రెండు వర్గాల వారు ఏకం కావాల్సిన అనివార్యతను కాంగ్రెస్ పెద్దలకు ఇరు వర్గాలకు చెప్పి నచ్చజెప్పడంతో వారు రాజీపడ్డారు. దీనితో జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పరం కాబోతోంది. జీవన రెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాబోయే ఏప్రిల్ లో ఖాళీ కాబోతున్న రానున్న రాజ్యసభ సీటును తమ నేతకు ఇవ్వాలని ఆయన అనుచరులు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు.

Next Story