- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఉద్యమంలో ఐటీ రంగం పాత్ర విలువైనది.. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్
ఐటీ రంగం లేకుండా తెలంగాణ ఉద్యమం పూర్తి కాదని.. నాటి ఐటీ ఉద్యోగుల సేవలను కొనియాడిన ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ గుర్తు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమంలో ఐటీ రంగం పాత్ర విలువైనదని ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆధ్వర్యంలో హెచ్‌ఐసీసీ, నోవోటెల్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఉద్యమంలో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు, నిపుణులు, పారిశ్రామిక వేత్తల వివరాలతో సమగ్ర నివేదిక అందించాలని టీటా వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాలకు సూచించారు.
ఈ సందర్భంగా సందీప్ కుమార్ మక్తాలా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, సాంకేతిక రంగ ప్రతినిధులు ముందుకొచ్చి తమ వివరాలు, సంబంధిత ఆధారాలను సమర్పించాలని కోరారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటా త్వరలోనే ఒక స్క్రీనింగ్ అండ్ సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ కమిటీ ధరఖాస్తులను స్వీకరించి, పరిశీలించి, అర్హులైన వారి వివరాలను సంకలనం చేసి ప్రభుత్వ కమిటీకి అందజేస్తుందని చెప్పారు. దరఖాస్తుల సమర్పణ విధానం, అవసరమైన పత్రాలు, గడువు తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో తమ భాగస్వామ్యాన్ని నిరూపించే పత్రికా కథనాలు, ఫొటోలు, వీడియోలు, ప్రశంసా పత్రాలు, వినతిపత్రాలు, సోషల్ మీడియా రికార్డులు తదితర ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని సందీప్ కుమార్ మక్తాలా సూచించారు.






