ఏపీ నిజాలు దాస్తున్నది.. తెలంగాణ అధికారుల ఆరోపన

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-07 16:36:41  IST  )

గోదావరి నదీ యాజమాన్యం బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం వాడీవేడిగా సాగింది. సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జీఆర్ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన బోర్డు సమావేశం నిర్వహించారు.

ఏపీ నిజాలు దాస్తున్నది.. తెలంగాణ అధికారుల ఆరోపన
X

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి నదీ యాజమాన్యం బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం వాడీవేడిగా సాగింది. సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జీఆర్ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బనకచర్లపై సమావేశంలో వాడీవేడి చర్చ సాగింది. ఏపీ ప్రభుత్వం గోదావరిపై నిర్మించ తలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశాన్నే తెలంగాణ ప్రధానంగా ప్రస్తావించింది.

ఏపీ నిజాలు దాస్తున్నది

బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం నిజాలు దాస్తున్నదని తెలంగాణ అధికారులు ఆరోపించారు. ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు, తెలంగాణకు జరిగే నష్టంపై ఇంతవరకు ఎలాంటి వివరాలు బహిర్గతం చేయలేదని చెప్పారు. ప్రాజెక్టు సమాచారం, వివరాలు ఎవరికీ తెలియకుండా పోయిందని అన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు అంశంపై బోర్డుకు కేంద్రం నుంచి లేఖ వచ్చి 5 నెలలు సైతం గడిచిపోయాయని.. ఆ విషయాన్ని కూడా కనీసం తమకు చెప్పలేదని వాపోయారు. డిసెంబర్ 10న బోర్డుకు ఏపీ నుంచి సమాచారం వచ్చిందని.. బోర్డుకు ఇన్‌పుట్ ఉన్నా తమకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.

ఇన్‌పుట్స్ ఇవ్వకుండా పనులు చేస్తే కుదరదు?

బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఇన్‌పుట్స్ ఇవ్వకుండా పనులు చేస్తే కుదరదని తెలంగాణ అధికారులు వాదించారు. అనుమతులు లేకుండానే ప్రాజెక్టును నిర్మిస్తున్నారని అధికారులు అభ్యంతరం తెలిపారు. ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు, గోదావరి బేసిన్‌లో నిర్మించే ఈ ప్రాజెక్టుతో తెలంగాణ జరిగే నష్టం తదితర వివరాలను ఏపీ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని తెలంగాణ అధికారులు బోర్డును కోరారు. ఫ్లడ్ వాటర్ పేరుతో 40 వేల క్యూసెక్కులు తీసుకెళ్తామని ఏపీ అంటున్నదని.. ఫ్లడ్ వాటర్ పేరుతో అలోకేటెడ్ వాటర్ సైతం తరలించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఏపీ అధికారులు.. బనకచర్లకు సంబంధించి ఇంకా డీపీఆర్ తయారు చేయలేదని సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు.

నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు

జీఆర్ఎంబీలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఏపీ, తెలంగాణకు చెందిన అధికారులను బోర్డు కార్యదర్శి అజగేషన్‌ వేధింపులకు గురిచేసే అంశం సైతం సమావేశంలో చర్చకు వచ్చింది. రాష్ట్రాలను సంప్రదించకుండా సమావేశాలు నిర్వహించడంపై సీరియస్ అయ్యారు. అలాగే.. అధికారులను వేధించడం, మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకర మాటలతో దూషించడంపై అధికారులు ఫిర్యాదు చేశారు. కాగా.. దీనిపై బోర్డు అధికారులు నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. అజగేషన్ వైఖరిపై కమిటీ విచారణ చేపట్టి తగిన రిపోర్డును బోర్డుకు అందజేయనుంది. అలాగే.. ఇతర ఫైనాన్షియల్ విషయాలపైనా ఈ కమిటీ విచారణ చేపట్టనుంది. అలాగే... పెదవాగు ప్రాజెక్టు ఆధునికీకరణపైనా సమావేశంలో చర్చించారు. రూ.15 కోట్లతో ప్రాజెక్టు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వర్‌రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Next Story