సర్కార్ మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.. కేంద్ర మంత్రి బండి సంజయ్

by Kema Shiva Kumar |

రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి అంటే మహిళా దినోత్సవం రోజు రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకోవడం కాదని, ఆచరణలో చూపి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమార్​అన్నారు.

సర్కార్ మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.. కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి అంటే మహిళా దినోత్సవం రోజు రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకోవడం కాదని, ఆచరణలో చూపి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమార్​ అన్నారు. శనివారం ఆయన ఓ కార్యాక్రమంలో మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ప్రతినెలా రూ.2,500లు ఇస్తామని 15 నెలలైనా నయాపైసా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రతి మహిళకు తులం బంగారం, స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని, బడ్జెట్‌లో మహిళా సంక్షేమానికి తగిన నిధులు ఖర్చు చేయడం లేదన్నారు. మద్యం ఏరులై పారి మహిళల జీవితాలు ఛిద్రమవుతున్నా ప్రభుత్వం పట్టింపులేదని ఆరోపించారు.

అధికారంలోకి వస్తే బెల్టు షాపులు లేకుండా చేస్తామని ఇచ్చిన హామీని గాలికొదిలేశాని ఫైర్ అయ్యారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మహిళలు ఆర్ధికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా చేయకుండా మహిళా దినోత్సవం రోజు మాత్రమే మహిళలను శక్తిగా మారుస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు, పెద్ద పెద్ద ప్రకటనలు, హోర్డింగ్స్, ఫెక్సీలు, సభలు, సమావేశాలు పెడితే ఎవరు నమ్మవరని ఎద్దేవా చేశారు. రాణిరుద్రమదేవి వారసత్వం పుణికి పుచ్చుకున్న నా తెలంగాణ మహిళలు చైతన్యవంతులని అన్నారు. మాటలతో మభ్యపెట్టే పాలకులకు, పార్టీలకు సమయం రాగానే కర్రు కాల్చివాత పెట్టడం తథ్యమని ఆక్షేపించారు. మహిళా దినోత్సవం నాడు మాత్రమే మహిళలను పొగిడి ఆ తరువాత వారిని విస్మరించే పార్టీ బీజేపీ కాదని అన్నారు.

స్త్రీలను లక్ష్మీ, సరస్వతి, దుర్గామాతగా పూజించే పార్టీ బీజేపీఅని, ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును ఈ దేశ ప్రథమ పౌరురాలిగా చేసిన పార్టీ తమదేనని తెలిపారు. ఏ మహిళల చేతిలో డబ్బు ఉందో ఆ కుటుంబం, ఆ దేశం సురక్షితంగా, ప్రగతి పథంలో నడుస్తుందని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తి ప్రధాని మోడీ మహిళకు ఆర్ధిక మంత్రి పగ్గాలు అప్పగించడంతో పాటు కేంద్ర కేబినెట్‌లో, ప్రభుత్వ పదవుల్లో సముచిత భాగస్వామ్యం కల్పించారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లను కట్టించి మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇంటి తాళాలు అప్పగించడంతోపాటు మరో 3 కోట్ల ఇండ్లను నిర్మించి మహిళలకు అందజేసేందుకు సిద్ధమైన నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

మహిళల పేరుతో 8 కోట్ల కుటుంబాలకు నల్లా కనక్షన్లు, 25 కోట్ల మంది స్త్రీలకు జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్లు, దాదాపు 25 కోట్ల మంది మహిళలకు రూ.10 లక్షల కోట్లు పీఎం ముద్రా యోజన కింద ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలిచ్చి మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడేలా తమ ప్రభుత్వం చేసిందన్నారు. మహిళా శక్తికి అసలైన నిర్వచనం చెబుతూ.. మహిళా సాధికారత అంటే ఏంటో చేతల్లో చూపుతున్నామని అన్నారు. దేశంలోని 11 కోట్ల మంది ఉజ్వల కనెక్షన్లు అందించి కట్టెల పొయ్యి బాధ లేకుండా చేసి మహిళల కంట కన్నీరు తుడిచిన మోడీ బేటీ బచావో.. బేటి బచావో, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన వంటి పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

Next Story