- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కాంల ప్రభుత్వం పోయి స్కీముల ప్రభుత్వం వచ్చుడు ఖాయం
స్కామ్‌ల ప్రభుత్వం పోయి, మళ్లీ స్కీంల ప్రభుత్వం రావడం ఖాయం అని, కేసీఆర్ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

దిశ, పటాన్‌చెరు టౌన్ : స్కామ్‌ల ప్రభుత్వం పోయి, మళ్లీ స్కీంల ప్రభుత్వం రావడం ఖాయం అని, కేసీఆర్ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం ఎస్‌ఐఆర్, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అంశాలపై.. పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేసి యావత్తు తెలంగాణ మీ వైపు చూసేలా చేశారని కితాబునిచ్చారు. పటాన్‌చెరు గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని ప్రశంసలు వర్షం కురిపించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రారంభించిన సర్ ప్రక్రియపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ కారణంగా ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగి ఎన్నికల ఫలితాలు మారాయని ఆరోపించారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నాయకులు సర్‌ను సీరియస్‌గా తీసుకోవాలని, బీఎల్ఏలను చురుకుగా పనిచేయించాలని సూచించారు.
రేవంత్‌రెడ్డి రూ.30 వేల కోట్ల విలువైన భూములను విక్రయించాడని ఆరోపించిన ఆయన, బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని అన్నారు. వేలకోట్ల ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ‘ఈట్ కా జవాబు పత్తర్ సే దేనా’ అంటూ కితాబిచ్చారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించకుండా.. అందాల పోటీలు, బోధి భవన్ వంటి కార్యక్రమాలకు రూ. వందల కోట్ల ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. సిగాచి ప్రమాదంలో 54 మంది మృతి చెందినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదని, కంపెనీ యాజమాన్యమే పరిహారం చెల్లించిందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో పటాన్ చెరు పట్టణంలో రూ.200 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించడం చేతకాని దద్దమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని విమర్శించారు. పటాన్‌చెరులో ఐటీ పార్క్ కోసం కేటాయించిన భూమిని ప్రభుత్వం అమ్ముకుందని ఆరోపించారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాలను బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రెండు లక్షల సభ్యత్వంతో కేసీఆర్‌కు గిఫ్ట్ అందిస్తాం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ఎస్ఐఆర్ అంశంపై బూత్ లెవెల్ స్థాయి నుండి కార్యకర్తలను అప్రమత్తం చేయడంతో పాటు.. అవగాహన సదస్సులు నిర్వహిస్తూ.. ప్రతి ఓటును కాపాడుకుంటున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. త్వరలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ అంశంలోనూ రెండు లక్షల సభ్యత్వం నమోదు చేసి కేసీఆర్‌కు బహుమతిగా అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ మాజీ చైర్మన్ బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






