‘భూ భారతి’ అమలుకు రంగం సిద్ధం.. వారిక్కూడా ఈజీగా అర్థమయ్యేలా పోర్టల్‌ను డిజైన్

by Gantepaka Srikanth |

భూ భారతి చట్టం అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. సామాన్యులకు ఈజీగా అర్థమయ్యేలా, సొంతగా దరఖాస్తు చేసుకునేలా ప్రస్తుత పోర్టల్ ను డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది.

‘భూ భారతి’ అమలుకు రంగం సిద్ధం.. వారిక్కూడా ఈజీగా అర్థమయ్యేలా పోర్టల్‌ను డిజైన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ భారతి చట్టం అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. సామాన్యులకు ఈజీగా అర్థమయ్యేలా, సొంతగా దరఖాస్తు చేసుకునేలా ప్రస్తుత పోర్టల్ ను డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది. కేవలం ఆరు నుంచి ఏడు మాడ్యూళ్లు మాత్రమే ఉండేలా అప్ గ్రేడ్ చేయనున్నట్లు సమాచారం. అప్లికేషన్ల స్వీకరణ, పరిశీలన, స్లాట్ బుకింగ్స్, రిజిస్ట్రేషన్లకు అవరోధం వాటిల్లకుండానే టెక్నికల్ గా అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆర్వోఆర్-2020, ఆర్వోఆర్-2025 మధ్య అంతులేని వ్యత్యాసం ఉన్నది. పైగా అధికార వికేంద్రీకరణ చేశారు. ధరణి పోర్టల్ ద్వారా సీసీఎల్ఏ చేస్తున్న పనులను కూడా జిల్లా స్థాయిలోనే పరిష్కరించే విధంగా చట్టాన్ని రూపొందించారు. ఇప్పుడీ అంశాల మార్పులన్నింటికీ టెక్నికల్ సపోర్ట్ ను భూ భారతి పోర్టల్ ద్వారా అమల్లోకి తీసుకురావాలి. దీని కోసం సీసీఎల్ఏ సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ మంద మకరంద్ నేతృత్వంలో ఎన్ఐసీ బృందం, టెక్నికల్ హెడ్స్ పని చేస్తున్నారు.

15 రోజుల్లో సాధ్యమే!

భూ భారతి చట్టానికి అనుగుణంగా రూల్స్ ను తయారు చేశారు. సీసీఎల్ఏ ఆమోదించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కూడా ఓకే చెప్పగానే పోర్టల్ ను తీర్చిదిద్దనున్నారు. ప్రభుత్వం చట్టాన్ని నోటిఫై చేసిన 15 రోజుల్లోనే అన్ని రకాల అంశాలను అమలు చేసేందుకు అవసరమైన టెక్నికల్ ఇష్యూస్ ను సాల్వ్ చేయొచ్చునని అధికారులు అంటున్నారు. ఎన్ఐసీ సిబ్బంది సహకరిస్తే పెద్ద కష్టమేం కాదని అభిప్రాయం. అంటే ప్రతి సెక్షన్ ను ఇంప్లిమెంట్ చేసేందుకు అవసరమైన రీతిలో తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నారు. రూల్స్ కు తగ్గట్లుగా సర్క్యులర్లు జారీ చేస్తారు. దానికి అనుగుణంగా కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు నోటీసులు జనరేట్ చేసేటట్లుగా, రిపోర్టులు పంపేటట్లుగా డిజైన్ చేయనున్నారు. చట్టానికి తగ్గట్లుగానే మాడ్యూల్స్ ఉంటాయి. విరాసత్ చేసేందుకు నోటీసులు జనరేట్ చేయాల్సిన అవసరం ఇప్పటి ధరణిలో లేదు. ఇక ముందు అనివార్యమవుతుంది. ఇది ఏ అధికారి ద్వారా చేపట్టనున్నారో ఆయన లాగిన్ నుంచి సాధ్యమయ్యేలా రూపొందిస్తారు. నోటీసులు, దర్యాప్తు, రిపోర్టులు పంపేలా ఏర్పాట్లు ఉంటాయి. అప్పీల్ కు వెళ్లడానికి వీలు కల్పిస్తారు. ప్రతీది పోర్టల్ ద్వారానే జరిపేందుకు అవసరమైన రీతిలో తయారు చేసేందుకు ప్లాన్ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.

సమాచారం.. లావాదేవీలు

వెబ్ పోర్టల్ లో భూ భారతి చట్టం, అమలుకు సంబంధించిన అంశాలు, ల్యాండ్ మ్యాటర్స్ వంటి సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేకంగా మాడ్యూల్స్ ఉంటాయి. ప్రస్తుతం రెవెన్యూ రికార్డులను చెక్ చేసుకుంటూ వివరాలను తెలుసుకుంటున్నట్లుగా ఉంటుంది. వినియోగదారుడి మాడ్యూల్స్ సంఖ్య కూడా ప్రస్తుతం కంటే తగ్గుతాయి. కానీ పూర్తి సమాచారం లభించేలా ఉంటుంది. కొన్ని అంశాలకు వేర్వేరు మాడ్యూల్స్ ఉన్నాయి. వాటిని మెర్జ్ చేయాలని నిర్ణయించారు. అలాగే ట్రాన్సాక్షన్స్ ప్రత్యేకంగా మాడ్యూల్స్ ఉంటాయి. ఇందులోనూ కొన్నింటిని కుదించే వీలుంది. ఉదాహరణకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా మార్చుకునేందుకు మూడు రకాలుగా ఉంది. గతంలోనే పేమెంట్ చేసినది, పేమెంట్ చేస్తూ, పాస్ బుక్ లేకపోతే.. ఇలాంటివన్నీ ఒకే దాని కింద చేర్చుతారు. దాని ద్వారా క్లిష్టత తగ్గుతుంది. క్రయ విక్రయాల్లో చాలా ఉన్నాయి. వాటిని కూడా కొన్నింటిని మెర్జ్ చేయడం ద్వారా సులువవుతుంది. అయితే అన్ని సెక్షన్లను ఒకేసారి అమల్లోకి తీసుకొస్తారా? లేదా దశల వారీగా చేస్తారా? అన్న డౌట్ ఉంది.

ధరణిలో సంతకాల ఫోర్జరీ

ప్రస్తుతం ధరణి పోర్టల్ లో 33 మాడ్యూళ్లతో జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏ మాడ్యూల్ కింద అప్లయ్ చేయాలన్న దానిపై కొందరు మీ సేవా నిర్వాహకులకు కూడా అర్థం కాని రీతిలో రూపొందించారు. దాంతో మరోసారి అప్లయ్ చేయాలంటూ అప్లికేషన్లను రిజెక్ట్ చేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ధరణి పోర్టల్ ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు కలెక్టర్ బయోమెట్రిక్ తో పరిష్కరిస్తే తహశీల్దార్ల సంతకాలే వస్తున్నాయి. ఎవరు ఫైనల్ చేస్తే వారి సంతకంతో కూడిన పత్రాలు, పాసు పుస్తకాలు రావాలి. కానీ ధరణిలో మాత్రం కింది స్థాయి అధికారి డిజిటల్ సంతకం వచ్చేటట్లుగా రూపొందించారు. పేరుకుపోయిన దరఖాస్తులను పరిశీలించడం కలెక్టర్లకు సాధ్యం కాదు. అన్నింటికీ కింది స్థాయి రిపోర్టులే ఆధారం. వాటి ఆధారంగానే పరిష్కరిస్తున్నారు. కేవలం అప్రూవ్ చేసి తహశీల్దార్లకు పంపితే డిజిటల్ సైన్ చేసేస్తారు. అయితే తహశీల్దార్ బయోమెట్రిక్, డిజిటల్ కీ ఇవ్వకపోయినా వారి సంతకం వచ్చేటట్లుగా చేయడం ధరణి పోర్టల్ లోని అతి పెద్ద పొరపాటు. పెండింగ్ మ్యుటేషన్ విషయంలో ఓ తహశీల్దార్ చెక్ లిస్టులో ‘నాట్ రికమండెడ్ యాజ్ ద సెల్లర్ ఈజ్ నాట్ పట్టాదార్’ రిమార్కుతో పంపారు. కానీ అది అప్రూవ్ అయ్యింది. ధరణి పోర్టల్ ద్వారా అందిన దరఖాస్తులను పరిష్కరించేందుకు పూర్తి బాధ్యతను కలెక్టర్లకు ఇచ్చారు. వీటి కోసం తహశీల్దార్లు రిపోర్టు ఇవ్వాలని ఎక్కడా లేదు. కలెక్టర్ అప్రూవ్ చేసి తహశీల్దార్ సంతకంతో పని పూర్తవుతుంది. ఇలాంటి పొరపాట్లు భూ భారతిలో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలన్న సూచనలు వచ్చాయి.

Next Story