- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడంచెల వ్యవస్థలో మార్పులు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలకు చరమగీతం?
ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థ వల్ల పెద్దగా ఉపయోగం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఈ వ్యవస్థలను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ వల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఆ వ్యవస్థ ద్వారా ఎన్నికైన వారికి సరియైన అధికారాలు, బాధ్యతలు లేవనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల స్థానంలో సర్పంచులు ఎంపీపీలను, ఎంపీపీలు జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకునే పరోక్ష విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సర్కార్ పంచాయతీరాజ్‌శాఖను ఆదేశించినట్లుగా సమాచారం. ఈనెల 23న జరిగే కేబినెట్భేటీలో దీనిపై చర్చించనున్నట్టుగా తెలుస్తున్నది. ఈ విధానాన్ని ఎత్తివేస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు అవసరంలేదని ఆలోచన చేస్తున్నట్లుగా వినికిడి. ఇతర రాష్ట్రాల్లో ఏ విధానం అమలవుతుందనే దానిపై పంచాయతీరాజ్‌శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. పంచాయతీరాజ్ఇచ్చే నివేదిక ఆధారంగా చట్టపరంగా, రాజకీయంగా ఇది సాధ్యం అవుతుందా? లేదా? అనేదానిపై పూర్తి వివరాలు సేకరించాకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.
చట్టసవరణలో కేంద్రం విఫలం..
పంచాయతీరాజ్‌లో ప్రస్తుతం మూడెంచల వ్యవస్థలో ఐదుగురు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధానం కొనసాగుతోంది. ఇది1995 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ఈ విధానాన్ని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. గ్రామంలో సర్వ అధికారాలు ఉన్న సర్పంచ్‌కు మండల పరిషత్‌లో ఎలాంటి అధికారం లేదు. మండలంలో అధికారాలు ఉన్న ఎంపీపీకి జిల్లా పరిషత్‌లో ఎటువంటి అధికారం లేదు. ఒక వ్యవస్థకు మరోక వ్యవస్థ సంబంధాలు లేకపోవడంతో కొత్తగా తీసుకొచ్చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలను రద్దు చేసి గతంలోనే లాగా ఎంపీపీలను సర్పంచ్‌లు.. జెడ్పీ చైర్మన్‌లను నేరుగా ప్రజలే ఎన్నుకునే విధానాన్ని తీసుకురావడానికి 1999లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రెండో టర్మ్‌లో తీవ్ర ప్రయత్నాలు చేసింది. నాటి సీఎం చంద్రబాబు, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా ఉన్న ఎమిలినేటి మాధవరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. చట్టసవరణ కూడా సిద్ధం అయింది. కేంద్రంలో నాడు ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా చట్ట సవరణ చేసింది. కానీ, రాజ్యసభలో బీజేపీకి బలం లేదు. దీంతో ఆనాడు రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేతమణిశంకర్ అయ్యర్.. కాంగ్రెస్తెచ్చిన 73, 74 చట్టసవరణ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టసవరణను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించడంతో చట్టసవరణ నిలిచిపోయింది. నాటి నుంచి నేటివరకు అనేక మార్లు దీనిని సవరించాలని ప్రయత్నాలు జరిగినా సాధ్యం కాలేదు. సీఎంగా కేసీఆర్ఉన్నప్పుడు సైతం దీనిపై ప్రయత్నాలు జరిగినా సాధ్యపడలేదు. తాజాగా సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానం సరికాదని అనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించడానికి సమయం అసన్నమైన తరుణంలో దీనిపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు..
ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఉంది. సర్పంచ్‌లకు మాత్రం లేదు. దీంతో సర్పంచులు తమకు ఓటు హక్కు కల్పించాలని కోరుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలు సైతం తమకు అధికారాలు ఇవ్వాలని కోరుతున్నారు. మండలాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో తమకు ప్రత్యేకంగా సీటు కేటాయించాలంటూ కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. వీటన్నంటికీ పరిష్కారం ఈ వ్యవస్థను ఎత్తివేయడం ద్వారా దోరుకుతుందనే అంచనాకు ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలో మార్పులు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేస్తే తప్ప సాధ్యం కాదని పంచాయతీరాజ్నిపుణులు స్పష్టంచేస్తున్నారు. గతంలో దీని కోసం జరిగిన ప్రయత్నాలను గుర్తు చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ అవసరం లేదనే అభిప్రాయం అత్యధిక శాతం ఉన్నా... దానికి చట్టసవరణ చేసే అధికారం మాత్రం కేంద్రానికి ఉండటంతో ఎవరూ ఏమి చేయలేకపోతున్నారని తెలుస్తున్నది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విజ్ఞప్తిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతవరకు సమ్మతిస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వ్యవస్థ రద్దుతో రాజకీయ నిరుద్యోగం..
అదే సమయంలో రాజకీయంగా వేలాది మందికి ఈ వ్యవస్థ గుర్తింపును, పదవులను కల్పిస్తోందని.. దాన్ని రద్దు చేస్తే పార్టీల్లో రాజకీయ నిరుద్యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేస్తే పార్టీ కేడర్‌లో వేలాది మందికి ఏ విధంగా పదవులు సర్దుబాటు చేయగలుగుతామని, వారికి రాజకీయంగా గుర్తింపు పొందడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అదే సమయంలో గతంలో కేంద్రంలోని కాంగ్రెస్‌పార్టీ తీసుకొచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుందని చెబుతున్నారు. కాగా, రేవంత్‌రెడ్డి జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని.. ఈ వ్యవస్థను ముఖ్యమంత్రి రద్దు చేయరనే అభిప్రాయాన్ని పార్టీలోని కొందరు వ్యక్తంచేస్తున్నారు.






