ఎయిర్ క్వాలిటీపై సర్కార్ అప్రమత్తం.. అధికారుల యాక్షన్ ప్లాన్ సిద్ధం

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-06 01:55:11  IST  )

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో గాలి నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

ఎయిర్ క్వాలిటీపై సర్కార్ అప్రమత్తం.. అధికారుల యాక్షన్ ప్లాన్ సిద్ధం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధిలో గాలి నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఢిల్లీ (Delhi) పరిస్థితి హైదరాబాద్ నగరంలో రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే అన్ని భాగస్వామ్య శాఖలతో సమావేశాలు నిర్వహించడం, యాక్షన్ ప్లాన్ రూపొందించే అంశాలపై చర్చించింది. ఎయిర్ క్వాలిటీపై ఎంసీహెచ్‌ఆర్డీలో (MCHRD) ప్రత్యేక సెమినార్ సైతం నిర్వహించారు. ఎయిర్ క్వాలిటీ మెరుగుపడితేనే నిజమైన అభివృద్ధి జరిగినట్టని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో పాటు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP)లో భాగంగా ఎయిర్ క్వాలిటీ మెరుగుపరచడానికి కేంద్రం నిధులు ఇస్తున్నది.

ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం..

రాష్ట్రంలోని అన్ని భాగస్వామ్య శాఖల అధికారులు గాలి శుభ్రతకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. వాహనాలు, రోడ్డు ధూళి, నిర్మాణాలు, పరిశ్రమలు, బహిరంగ దహనం వంటి ప్రధాన కాలుష్య మూలాలను ఈ ప్రణాళిక పరిష్కరిస్తోంది. ట్రాఫిక్ సమస్యతో వాహనాలు ఎక్కువ సమయం సిగ్నల్ వద్ద నిలిచిపోవడంతో కాలుష్యం పెరుగుతోందని అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే 400 అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ (ATSC) సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15వ ఆర్థిక సంఘం నిధులతో తెలంగాణ రెడ్కో ఆధ్వర్యంలో 150 ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ ఆర్టీసీ సైతం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించి, 10 డిపోలలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. టీజీఆర్టీసీ ఆధ్వర్యంలో 215 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేశారు. వీటిలో మొదటి దశలో 110 బస్సులను కొనుగోలు చేశారు.

హైదరాబాద్ మహానగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి 5,614 ఎకరాల్లో మొక్కలు నాటడం, గ్రీనరీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలో వాహనాలు సాఫీగా వెళ్లడానికి ఫ్లైఓవర్లను నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఎస్ఆర్‌డీపీ (SRDP)లో భాగంగా 20కి పైగా ఫ్లైఓవర్లను నిర్మించారు. హెచ్-సిటీలో భాగంగా రూ. 7 వేల కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్ పాసులను నిర్మించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనితో పాటు 3,240 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 23 కిలోమీటర్ల సోలార్ రూఫింగ్ సైకిల్ ట్రాక్స్ ఏర్పాటు చేయనున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర 250 కార్లు, 200 టూవీలర్స్ సామర్థ్యంతో కూడిన ఆటోమేటెడ్ మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేబీఆర్ పార్కు వద్ద కూడా మల్టీలెవల్ పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

పరిశ్రమల నియంత్రణ..

పరిశ్రమల ద్వారా 32 శాతం కాలుష్యం పెరుగుతోందని అధికారులు గుర్తించారు. పరిశ్రమల ఉద్గారాల నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు, పరిశ్రమల పునర్వ్యవస్థీకరణ, జోనింగ్ సంస్కరణలు, మెరుగైన భూ వినియోగ ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమలను ఓఆర్‌ఆర్ వెలుపలికి తరలించడానికి ప్రభుత్వం హిల్ట్ (HILT) పాలసీని రూపొందించింది.

నిరంతర పర్యవేక్షణ

హైదరాబాద్ మహానగరంలో గాలి నాణ్యత నిరంతర పర్యవేక్షణకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఆధ్వర్యంలో 14 స్టేషన్లను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ జిల్లా: జూపార్కులోని వెటర్నరీ హాస్పిటల్, సనత్ నగర్‌లోని టీజీపీసీబీ బిల్డింగ్, మలక్‌పేట్‌లోని లూయిస్ బ్రెయిలీ పార్క్, ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ఆఫీస్.

రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU), కోకాపేట్ కమ్యూనిటీ పార్క్.

మేడ్చల్ - మల్కాజ్‌గిరి: కోంపల్లి కమ్యూనిటీ హాల్, కాప్రా జీహెచ్‌ఎంసీ సర్కిల్ ఆఫీస్, నాచారంలోని ఇండ్వా టెక్నాలజీస్.

సంగారెడ్డి జిల్లా: ఆర్సీపురం సింఫోనీ పార్కు, కందిలోని ఐఐటీ హైదరాబాద్, పటాన్‌చెరులోని ఇక్రిశాట్ (ICRISAT), బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా, పాశమైలారంలోని ఫైర్ స్టేషన్ బిల్డింగ్.

Next Story