SC గురుకులాలను విస్మరించిన సర్కార్.. వేతనాల కోసం సిబ్బంది ఎదురుచూపులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-13 01:59:57  IST  )

రాష్ట్రంలో ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు వేతనాలు విడుదల చేసిన ప్రభుత్వం ఎస్సీ గురుకులాలను మరిచింది.

SC గురుకులాలను విస్మరించిన సర్కార్.. వేతనాల కోసం సిబ్బంది ఎదురుచూపులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు వేతనాలు విడుదల చేసిన ప్రభుత్వం ఎస్సీ గురుకులాలను మరిచింది. పన్నెండో తేదీ వచ్చినా జీతాలు రాకపోవడంతో ఎంప్లాయీస్ కు కుటుంబపోషణ భారంగా మారింది. కాంట్రాక్ట్, రెగ్యులర్, పార్ట్ టైం ఎంప్లాయీస్.. ఇలా అందరి పరిస్థితి అలాగే ఉన్నది. సమయానికి వేతనాలు రాక.. కనీస అవసరాలు తీర్చులేకపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల ఇవే అవస్థలు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.

8 వేల మంది ఉద్యోగులు

రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో సుమారు ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ పని చేస్తున్నారు. ఇందులో రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా పార్ట్ టైం, గెస్ట్ ఫ్యాకల్టీ, కాంట్రాక్టు సిబ్బంది ఉంటున్నారు. అయితే వీరికి సకాలంలో వేతనాలు అందడం లేదు. గతంలో మూడు నెలల వేతనాలు పెండింగులో పడ్డాయని, వాటిని ఏప్రిల్ రెండో వారంలో అందజేశారని ఉద్యోగులు చెబుతున్నారు. ఈనెల వేతనాలు ఇప్పటికీ రాలేదని పేర్కొంటున్నారు. దీంతో నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బడ్జెట్ వచ్చినా..

ఎస్టీ, బీసీ, మైనార్టీల గురుకులాల సోసైటీలకు సకాలంలో వేతనాలు చెల్లిస్తుండగా.. ఎస్సీ గురుకులాలపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వేతనాల్లో ఆలస్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ వచ్చినా టోకెన్ల క్లియరెన్స్ కోసం పడిగాపులు కాయల్సిన పరిస్థితులు నెలకొందని పేర్కొంటున్నారు. వేతనాలు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగుల కుటుంబాల అవసరాలను సర్కారు గుర్తించాలని, ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు విడుదల చేయాలని కోరుతున్నారు.

Next Story