సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యం...

by Taduka Kalyani |

సింగరేణి కార్మికుల హక్కులను కాపాడేందుకు ఎప్పుడూ ముందుంటానని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యం...
X

దిశ, కొత్తగూడెం సింగరేణి: సింగరేణి కార్మికుల హక్కులను కాపాడేందుకు ఎప్పుడూ ముందుంటానని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఆమె విస్తృతంగా పర్యటించారు. బీఎంఎస్ చేపట్టిన బై బాట కార్యక్రమం సందర్భంగా కార్మికులను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా అవకాశం కల్పించిన నాయకులు రియాజ్, పూడ జనార్దన్, శ్రీలత, ఆంజనేయులు, ఆసిఫ్‌తో పాటు సంఘం నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల త్యాగాలు కీలకమని పేర్కొన్న ఆమె, కార్మికుల హక్కుగా ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహించి, అనంతరం ప్రతి నెలా క్రమం తప్పకుండా మెడికల్ బోర్డు ఏర్పాటు చేసే విధంగా స్పష్టమైన పాలసీ తీసుకురావాలని కోరారు. మెడికల్ బోర్డుపై అధికారిక ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని, లేకపోతే ప్రకటించినట్లుగానే నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. అలాగే సింగరేణికి రావాల్సిన బొగ్గు గనులు, జెన్‌కో, ట్రాన్స్‌కో బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం సాధించాలని, బయ్యారం ఉక్కు పరిశ్రమను సింగరేణి ఆధ్వర్యంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నాణ్యమైన భద్రతా పరికరాలు, తాగునీరు, సంక్షేమ సదుపాయాలు కల్పించాలని, అధికారులు కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని సూచించారు. ఓపెన్‌కాస్ట్, అండర్‌గ్రౌండ్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి హెచ్ఎంఎస్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. త్వరలో జరగనున్న సింగరేణి కార్మిక సంఘ ఎన్నికల్లో హెచ్ఎంఎస్‌కు మద్దతు ఇవ్వాలని కార్మికులను కోరారు.

Next Story