'సీల్' చేసిన భవనంలోనే ఆసుపత్రి...ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభం!

by velandi.Saikiran |

అధికారులు సీల్ వేసిన భవనంలోనే ఆసుపత్రిని ప్రారంభించడం, ఆ కార్యక్రమానికి ఏకంగా స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరు కావడం పై విమర్శలు వస్తున్నాయి.

సీల్ చేసిన భవనంలోనే ఆసుపత్రి...ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభం!
X

దిశ, మేడ్చల్ బ్యూరో: అధికారులు సీల్ వేసిన భవనంలోనే ఆసుపత్రిని ప్రారంభించడం, ఆ కార్యక్రమానికి ఏకంగా స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరు కావడం పై విమర్శలు వస్తున్నాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ బ్యాంకు కాలనీలో నిర్మించిన ఈ భవనం అక్రమమని తేల్చి, గతంలో టౌన్ ప్లానింగ్ అధికారులు దానికి సీల్ వేశారు. సీజ్ అయిన భవనం నిర్మాణం పూర్తయి అందులో ఒక చిల్డ్రన్ హాస్పిటల్ ఏర్పాటు చేయడంపై ఆరోపణలు వస్తున్నాయి. కనీస సెట్‌బ్యాక్స్, పార్కింగ్ సౌకర్యం, ఫైర్ సేఫ్టీ , ఆక్యుపెన్సర్ సర్టిఫికెట్ లేని ఆ భవనంలో ఏ విధంగా ఆసుపత్రి ప్రారంభానికి అనుమతులు వచ్చాయి అనేది ప్రశ్న. అయితే, అధికారులు వేసిన సీలును తొలగించారా? లేదా? అన్న స్పష్టత లేకపోగా, ఇప్పుడు అదే భవనంలో 'చిరాన్ అడ్వాన్స్డ్ కేర్' ఆసుపత్రిని ప్రారంభించారు.

ఎమ్మెల్యేని తప్పుదారి పట్టించారా..?

అక్రమ కట్టడమని తెలిసినా, లేదా అధికార యంత్రాంగం నిద్రమత్తును గమనించలేదో తెలియదు కానీ.. ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ హాజరై రిబ్బన్ కట్ చేయడం గమనార్హం. ఒకవైపు అధికారులు సీల్ వేసి 'అక్రమ నిర్మాణం' అని ప్రకటిస్తే, మరోవైపు ప్రజా ప్రతినిధే ఆ భవనంలో ఆసుపత్రిని ప్రారంభించడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భవనం సీజ్ అయిన విషయాన్ని దాచిపెట్టి ఆసుపత్రి ప్రారంభానికి స్వాగతించారాని చెబుతున్నారు. ఆసుపత్రి ఏర్పాటును స్వాగతిస్తున్నామని, కానీ భద్రతా ప్రమాణాలు లేని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాల్లో ఇలాంటివి ఎలా సాధ్యమవుతాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల మౌనం.. అనుమానాలకు తావు

భవనం సీల్ చేసినా పనులు ఎలా పూర్తయ్యాయి? ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి కూడా అధికారులు ఎందుకు ఆయనకు సమాచారం ఇవ్వలేదు?. టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ వ్యవహారంలో ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు? వంటి ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఆసుపత్రి విషయంలో కనీస జాగ్రత్తలు పాటించకుండా, అక్రమ భవనాలకు ఇలాంటి ప్రోత్సాహం అందించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ఆ భవనానికి ఉన్న అనుమతులు, సీల్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై జీడిమెట్ల టౌన్ ప్లానింగ్ ఏసీపి రాణి మాట్లాడుతూ , కొత్తగా బాధ్యతలు చేపట్టడం వలన తనకు ఆ విషయం తెలియదని, సీజైనా భవనం ఏ విధంగా ఓపెన్ చేశారూ..? అనే విషయంపై పరిశీలించి క్రిమినల్ కేసులు బుక్ చేసే విధంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

Next Story