- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెల్‌బోర్న్ మార్వెల్ స్టేడియంలో ప్రవాస భారతీయుల ‘బ్లాక్‌బస్టర్’ సభ
ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లోని ప్రసిద్ధ 'మార్వెల్ స్టేడియం' (Marvel Stadium) లో ఏర్పాటు చేసిన భారీ ప్రవాస భారతీయుల (Indian Diaspora) సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా పర్యటన ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధాని మోడీకి మెల్‌బోర్న్ నగరం అద్భుతమైన స్వాగతం పలికింది. మెల్‌బోర్న్‌లోని ప్రసిద్ధ 'మార్వెల్ స్టేడియం' (Marvel Stadium) లో ఏర్పాటు చేసిన భారీ ప్రవాస భారతీయుల (Indian Diaspora) సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేడియానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి భారతదేశానికి అత్యంత ఆప్తుడు, మంచి మిత్రుడు అని కొనియాడారు. "నేను తొలిసారి 2014లో ఇక్కడికి వచ్చాను, మళ్లీ 2023లో వచ్చాను.. ఇప్పుడు మరోసారి మీ ముందుకు వచ్చాను. ఈ విధంగా ఆస్ట్రేలియాకు మూడుసార్లు వచ్చి నేను పర్యటనల్లో హ్యాట్రిక్ కొట్టాను" అని మోడీ వ్యాఖ్యానించారు.
తన గత పర్యటనల కంటే భిన్నంగా ఈసారి ప్రత్యేకంగా మెల్‌బోర్న్ వాసులతో సమయం గడపాలని వచ్చానని ప్రధాని మోడీ పేర్కొన్నారు. క్రికెట్ ప్రస్తావన తెస్తూ.. భారతదేశంలోని అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం (నరేంద్ర మోదీ స్టేడియం) ఉండగా, మెల్‌బోర్న్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఐకానిక్ క్రికెట్ స్టేడియంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని గుర్తుచేశారు. ప్రవాస భారతీయులతో కిక్కిరిసిపోయిన మార్వెల్ స్టేడియం సభను ఉద్దేశించి "ఆస్ట్రేలియాలో ఈ షో హౌస్‌ఫుల్, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది" అని హర్షం వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యాన్ని గుర్తుచేస్తూ.. తాను 2014లో పర్యటించడానికి ముందు వరకు, గత 18 ఏళ్ల కాలంలో ఏ భారత ప్రధానమంత్రి కూడా ఆస్ట్రేలియాలో పర్యటించలేదని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అలాగే ఆస్ట్రేలియా అభివృద్ధిలో ఇండియన్ డయాస్పోరా రోల్ చాలా గొప్పదని, మెల్‌బోర్న్ ప్రాంతం భారతీయ సంస్కృతితో నిండి ఉందని గుర్తు చేశారు. ఆస్ట్రేలియాతో పాటు భారత్ అభివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలని ప్రవాస భారతీయులకు ఈ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అలాగే ఒక కల పూర్తవగానే.. మరో కొత్త కల పుడుతుంది. ఒక లక్ష్యం పూర్తి కాగానే.. మరో పెద్ద లక్ష్యాన్ని నిర్ధేశించుకోండి. మెల్‌బోర్న్ ఒక మినీ ఇండియా. ప్రవాస భారతీయులే ఇరుదేశాల బంధానికి వారధి అంటూ ప్రధాని మోడీ ప్రవాస భారతీయుల్లో ఉత్సాహాన్ని నింపారు.






