బీఆర్ఎస్‌ గెలిచే నియోజకవర్గాలపై కేటీఆర్ ప్రిడిక్షన్.. సీఎం సొంతసర్వేలో వెల్లడి

by Naga Rani Yarlagadda |

తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ దే విజయమని కేటీఆర్ జోస్యం చెప్పారు.

బీఆర్ఎస్‌ గెలిచే నియోజకవర్గాలపై కేటీఆర్ ప్రిడిక్షన్.. సీఎం సొంతసర్వేలో వెల్లడి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ దే విజయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తన పరిపాలన, నాయకత్వంపై చేయించుకున్న సొంత సర్వేలోనే ఈ విషయాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు. సీఎం సర్వేలో కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమయిందని, ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 78 సీట్లు గెలుస్తుందని వెల్లడైందన్నారు. మీడియా, ఇంటెలిజెన్స్ విభాగాల ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఇదే విషయం స్పష్టమయిందని తెలిపారు.

రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ ను మరోసారి సీఎంగా చూడాలనుకుంటున్నారని, ఆ విషయాన్ని ప్రజలే స్పష్టంగా చెప్పారన్నారు. సొంత సర్వేలోనే తనకు తీవ్ర ప్రజావ్యతిరేకత రావడాన్ని తట్టుకోలేకనే సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమని, ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని, బీజేపీ, మరే ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జారుడు బండపై నిలబడిందని, ఇప్పుడు తిరిగి పుంజుకునే అవకాశాలు కూడా లేవని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇకపై ప్రజా ఆమోదం పొందడం అత్యంత కష్టమని, ఏం చేసినా మళ్లీ ప్రజల నమ్మకాన్ని పొందలేరన్నారు.

Next Story