కరకట్ట సందర్శించిన ప్రత్యేక కమిటీ

by Taduka Kalyani |

భద్రాచలం పట్టణం గోదావరి వరద ముంపుకు గురికాకుండా చర్యలు చేపట్టేందుకు సి డబ్ల్యూ సి సంస్థ ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్లతో ఒక ప్రత్యేక కమిటీ ని నియమించింది.

కరకట్ట సందర్శించిన ప్రత్యేక కమిటీ
X

దిశ, భద్రాచలం : భద్రాచలం పట్టణం గోదావరి వరద ముంపుకు గురికాకుండా చర్యలు చేపట్టేందుకు సి డబ్ల్యూ సి సంస్థ ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్లతో ఒక ప్రత్యేక కమిటీ ని నియమించింది. ఈ కమిటీ గురువారం కరకట్ట స్లూయిజ్ పాయింట్స్ పరిశీలించింది. గోదావరి 40 అడుగులు దాటితే కరకట్టకు ఉన్న స్లూయిజ్ లు లీక్ అయి గోదావరి నీరు పట్టణంలోకి ప్రవేశించి పలు కాలనీలు వరద ముంపుకు గురవుతాయి. గోదావరి ఉధృతంగా ప్రవహించినప్పుడు, పట్టణంలోని వర్షపు నీరు గోదావరిలోకి వెళ్ళడానికి బాహుబలి మోటార్ల ద్వారా నీటిని గోదావరిలోకి పంప్ చేస్తారు. అయితే కరకట్టకు ఉన్న స్లూయిజ్ లను వరదలకు ముందే ప్రతి సంవత్సరం మరమ్మతులు చేసినా... వరదలు సమయంలో గోదావరి నీరు లీక్ అయి పట్టణంలోకి ప్రవేశిస్తుంది. భద్రాచలం ప్రాంతంలో కరకట్టకు 8 స్లూయిజ్ లు ఉండగా, ఆంధ్ర ప్రాంతం ఎటపాక వైపు రెండు స్లూయిజ్ లు ఉన్నాయి. ఈ స్లూయిజ్ లను ప్రత్యేక కమిటీ పరిశీలించి తక్షణ పనులు ఏం చేపట్టాలో ఒక నివేదిక తయారు చేసి సి డబ్ల్యూ సి కి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

కరకట్టను గాలికి వదిలేసిన ఆంధ్ర ప్రభుత్వం

భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కరకట్ట రక్షణ చర్యలను ఆంధ్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. కరకట్ట రక్షణ గోడ విరిగి పడి సంవత్సరం అవుతున్నా... ఇంతవరకు స్పందించలేదు. కరకట్ట స్లూయిజ్ లు మరమ్మతులు చేపట్టడం లేదు. దీంతో గోదావరి 36 అడుగులకు చేరుకుంటే, కరకట్ట స్లూయిజ్ లు లీక్ అయి వరద నీరు భద్రాచలం ప్రాంతం వైపుకు రావడంతో పట్టణంలోని పలు ప్రాంతాలు వరద ముంపుకు గురవుతున్నాయి. వరద నీరు గోదావరి లోకి ఎత్తి పోయడానికి ఆంధ్ర కరకట్ట ప్రాంతంలో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. దీంతో వరదలు సమయంలో ఆయిల్ ఇంజన్ ల ద్వారా నీరు ఎత్తి పోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్ర అధికారుల అలసత్వం భద్రాచలం పట్టణానికి శాపంగా మారింది. ఆంధ్ర వైపు ఉన్న కరకట్టకు మరమ్మతులు నిర్వహించాలని భద్రాచలం ఇరిగేషన్ అధికారులు అనేకసార్లు ఆంధ్ర అధికారులకు లేఖలు పంపినా ఫలితం లేకుండా పోయింది. మంత్రి తుమ్మల నాగేశ్వరావు సైతం ఈ సమస్యను ఆంధ్ర అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా.. వారిలో చలనం లేదు. గురువారం కరకట్ట పరిశీలిచిన కమిటీలో ఆంధ్ర అధికారులు కూడా ఉండటంతో, కమిటీ దృష్టికి భద్రాచలం ఇరిగేషన్ అధికారులు ఆంధ్ర సైడ్ కరకట్ట దుస్థితిని తీసుకుని వెళ్లారు.

Next Story