తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి ‘ఏటీఎం’గా మారింది: జేపీ నడ్డా

by Malleboina Mahesh |

రేవంత్ సర్కార్ ఢిల్లీ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మారిందని తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి ‘ఏటీఎం’గా మారింది: జేపీ నడ్డా
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం (జూలై 9, 2026) తెలంగాణలో పర్యటించిన ఆయన.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవినీతిమయ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం 'కాళేశ్వరం ప్రాజెక్ట్'ను తమకు ఏటీఎంలా వాడుకుంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్నే ఢిల్లీలోని తమ హైకమాండ్‌కు ‘ఏటీఎం’ (ATM)గా మార్చేసిందని నడ్డా ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించి, నిధులను ఢిల్లీకి తరలిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి చెందాలంటే ఇక్కడ కూడా బీజేపీ ఆధ్వర్యంలో ‘డబుల్ ఇంజన్ సర్కార్’ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

80 కోట్ల మందికి ఆహార భద్రత

ప్రధానమంత్రి నరేంద్ర మోఢీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశం అన్ని రంగాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని జేపీ నడ్డా స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొంటూ.. దేశవ్యాప్తంగా సుమారు 80 కోట్ల మంది ప్రజలకు తాము ఉచిత రేషన్ ద్వారా ఆహార భద్రత కల్పిస్తున్నామని గుర్తుచేశారు. ఇందులో భాగంగానే తెలంగాణలో కూడా దాదాపు కోటి 20 లక్షల మంది ప్రజలకు ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ (PMGKY) కింద ఉచితంగా బియ్యం, పప్పుధాన్యాలను అందిస్తూ కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని నడ్డా వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

Next Story