Customs Duty: ఎలక్ట్రానిక్స్ తయారీకి కేంద్రం బూస్ట్

by S Gopi |

ఈ నిర్ణయం ద్వారా ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ రంగాల్లో భారత్ పారిశ్రామికంగా మరింత బలోపేతం కానుంది.

Customs Duty: ఎలక్ట్రానిక్స్ తయారీకి కేంద్రం బూస్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా తయారీ ఖర్చులను తగ్గించే వ్యూహంతో ఎంపిక చేసిన ముడిసరుకులు, అత్యాధునిక యంత్రాలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని (బీసీడీ) పూర్తిగా మినహాయిస్తూ లేదా తగ్గిస్తూ ప్రభుత్వం మూడు కీలక నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నిర్ణయం ద్వారా ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ రంగాల్లో భారత్ పారిశ్రామికంగా మరింత బలోపేతం కానుంది. ఇదివరకు పరిశ్రమలకు ఇస్తున్న కీలక పన్ను మినహాయింపులను పొడిగించడంతో పాటు, భవిష్యత్ అవసరాల కోసం సరికొత్త రాయితీలను తీసుకొచ్చింది. పాత నిబంధనల కొనసాగింపు, సరికొత్త సంస్కరణల కలయికతో రూపొందించిన ఈ విధానం ద్వారా, దేశీయంగా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.

2029, మార్చి వరకు పన్ను మినహాయింపులు

వీటిలో ఇదివరకే అమల్లో ఉన్న పన్ను ఉపశమనాలకు ప్రభుత్వం పొడిగింపు ఇచ్చింది. ఆటోమొబైల్, వైద్య పరికరాల డిస్‌ప్లే తయారీలో వాడే 5 రకాల కీలక విడిభాగాలపై (సెల్స్, ఫ్రేమ్‌లు వంటివి), అలాగే మొబైల్ ఫోన్ల వైర్‌లెస్ ఛార్జింగ్ కాయిల్స్ తయారీకి వాడే 6 రకాల విడిభాగాలపై గతంలో ఉన్న బీసీడీ మినహాయింపును కేంద్రం ఇప్పుడు ఏకంగా 2029, మార్చి 31 వరకు కొనసాగిస్తూ గడువు పొడిగించింది. అయితే, ఈ పాత మినహాయింపులు ఎప్పటిలాగే సాధారణ మొబైల్స్, స్మార్ట్‌వాచ్‌ల డిస్‌ప్లేలకు వర్తించవని స్పష్టం చేసింది.

కొత్త రాయితీ లిస్టు

మరోవైపు, లిథియం-అయాన్ బ్యాటరీల తయారీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఒక సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఇంతకుముందు బ్యాటరీ తయారీ యంత్రాలపై ఉన్న పాత చిన్న జాబితాను రద్దు చేసి.. దాని స్థానంలో కోటింగ్, వైండింగ్, వెల్డింగ్, టెస్టింగ్ వంటి సరికొత్త అధునాతన టెక్నాలజీలతో కూడిన ఏకంగా 85 రకాల భారీ యంత్రాలను రాయితీ లిస్టులో చేర్చింది. ఈ కొత్త నిర్ణయంపై గ్రాంట్ థార్న్‌టన్ భారత్ ప్రతినిధి మనోజ్ మిశ్రా స్పందిస్తూ.. పాత విడిభాగాల సుంకాలను కొనసాగిస్తూనే, కొత్తగా భారీ యంత్రాలపై పన్నులు తగ్గించడం వల్ల దేశీయంగా మెగా బ్యాటరీ ప్లాంట్లు, గిగా ఫ్యాక్టరీల ఏర్పాటుకు, పెట్టుబడులకు ఊతమివ్వొచ్చని హర్షం వ్యక్తం చేశారు.

Next Story