జూలై 15లోపు హెల్త్ కార్డుల ఉత్తర్వులు !

by velandi.Saikiran |

పీఆర్టీయూ-టీఎస్ ఆధ్వర్యంలో మహమ్మదాబాద్ మండల శాఖ నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం ఉత్సాహంగా జరిగింది.

జూలై 15లోపు హెల్త్ కార్డుల ఉత్తర్వులు !
X

దిశ,మహమ్మదాబాద్: పీఆర్టీయూ-టీఎస్ ఆధ్వర్యంలో మహమ్మదాబాద్ మండల శాఖ నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పీఆర్టీయూ-టీఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు జి. మదన్ మోహన్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. సుధాకర్ రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు వి. బుచ్చారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విజయదశమిలోపు దాదాపు 30 శాతం ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఈ నెల 15వ తేదీలోపు హెల్త్ కార్డులకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశముందని పేర్కొన్నారు.

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కూడా ఈ నెలాఖరులోపు ప్రారంభమయ్యే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారిన టెట్ సమస్యపై పీఆర్టీయూ-టీఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఏడాదికి రెండు పర్యాయాలు టెట్ నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయించడంలో సంఘం కీలక పాత్ర పోషించిందని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి ఉపాధ్యాయుడి హక్కుల పరిరక్షణలో పీఆర్టీయూ-టీఎస్ ఎల్లప్పుడూ ముందుంటుందని, ఉపాధ్యాయుల సంక్షేమమే సంఘం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఉపాధ్యాయుడు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సంఘానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మహమ్మదాబాద్ మండల అధ్యక్షుడు బీజం భీంరెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, జిల్లా మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు గీత, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు పాండురంగారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాము, జిల్లా కార్యదర్శి హన్మయ్య, మండల ఉపాధ్యక్షుడు రమేష్, మండల కార్యదర్శి అంజిలయ్య, సంఘ నాయకులు రవీందర్ రెడ్డి, బాల్‌రాజు గౌడ్, బసయ్య, ప్రధాన కార్యదర్శి పి. శ్రీనివాస్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story