ముంబై నుంచి హైదరాబాద్‌కు 22.97 కిలోల గంజా.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

by Taduka Kalyani |

హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్-న్యూ), చిలకలగూడ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర గంజా స్మగ్లింగ్ ముఠాను ఛేదించి 22.97 కిలోల వాణిజ్య పరిమాణంలో గంజాను స్వాధీనం చేసుకున్నారు.

ముంబై నుంచి హైదరాబాద్‌కు 22.97 కిలోల గంజా.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
X

దిశ, సికింద్రాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్-న్యూ), చిలకలగూడ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర గంజా స్మగ్లింగ్ ముఠాను ఛేదించి 22.97 కిలోల వాణిజ్య పరిమాణంలో గంజాను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జార్ఖండ్‌కు చెందిన ఓ యువకుడిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ముంబై నుంచి దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ మొత్తంలో గంజా హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని చిలకలగూడ క్రాస్‌రోడ్స్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, ట్రాలీ బ్యాగ్, షోల్డర్ బ్యాగ్‌లలో దాచిన 12 ప్యాకెట్లలో 22.97 కిలోల గంజా లభ్యమైంది. అరెస్టయిన నిందితుడిని సంతోష్ పండిత్ (20), జార్ఖండ్ రాష్ట్రం గిరిడిహ్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడు 2023 నుంచి జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య గంజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

దాదాపు 20 రోజుల క్రితం జార్ఖండ్ నుంచి సుమారు 60 కిలోల గంజాను ముంబైకి తరలించి, అక్కడ నిల్వ ఉంచిన తర్వాత అందులో 22.97 కిలోలను హైదరాబాద్‌లో విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి గంజాతో పాటు ఒక మొబైల్ ఫోన్, ముంబై–సికింద్రాబాద్ రైలు టికెట్, రూ.3,100 నగదు, రవాణాకు ఉపయోగించిన రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులు శుభమ్ మిశ్రా, సత్యం మిశ్రా, సచిన్ శర్మ పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయని పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను చిలకలగూడ ఎస్‌ఐ కె. శివకుమార్, హెచ్-న్యూ, క్లూస్ టీం అధికారులు నిర్వహించగా, ఇన్‌స్పెక్టర్ వి. రామకృష్ణ, ఏసీపీ కె. శశాంక్ రెడ్డి, అదనపు డీసీపీ జె. నర్సయ్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై హైదరాబాద్ పోలీసులు జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నారని, మాదకద్రవ్యాల రవాణా, నిల్వ, విక్రయం, ఆర్థిక సహకారం అందించే వారిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story