ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి.. నాలుగు రైల్వే స్టేషన్లను తనిఖీ చేసిన జీఎం

by Taduka Kalyani |

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గురువారం శంకర్‌పల్లి, నాగలపల్లి, హైటెక్ సిటీ, కాచిగూడ రైల్వే స్టేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు, అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.

ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి.. నాలుగు రైల్వే స్టేషన్లను తనిఖీ చేసిన జీఎం
X

దిశ, సికింద్రాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గురువారం శంకర్‌పల్లి, నాగలపల్లి, హైటెక్ సిటీ, కాచిగూడ రైల్వే స్టేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు, అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్–శంకర్‌పల్లి సెక్షన్‌లో రియర్ విండో తనిఖీ కూడా నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సిగ్నలింగ్ వ్యవస్థ, ట్రాక్ పరిస్థితి, సెక్షనల్ వేగాలు, చిన్న వంతెనలు, లెవల్ క్రాసింగ్ గేట్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్టేషన్ భవనాలు, సర్క్యులేటింగ్ ఏరియాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.26 కోట్ల వ్యయంతో అభివృద్ధి చెందుతున్న హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పనులను ప్రత్యేకంగా పరిశీలించి ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలు, సిగ్నలింగ్ వ్యవస్థ, భద్రతా పరికరాలను సమీక్షించారు. అనంతరం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం నంబర్–1, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, గోల్నాక వైపు రెండో ప్రవేశ ద్వారం ప్రాంతాన్ని పరిశీలించి, స్టేషన్ ఆధునీకరణ ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. ఈ తనిఖీల్లో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మతో పాటు ప్రధాన కార్యాలయం, డివిజన్‌కు చెందిన సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Next Story