‘హంగ్’ మున్సిపాలిటీల్లో పాగా వేయడమే లక్ష్యం.. క్షేత్ర స్థాయిలో రంగంలోకి మంత్రులు!

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మొదలైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు క్షేత్ర స్థాయిలో రంగంలోకి దిగారు.

‘హంగ్’ మున్సిపాలిటీల్లో పాగా వేయడమే లక్ష్యం.. క్షేత్ర స్థాయిలో రంగంలోకి మంత్రులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికార పీఠాలను దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పుతున్నది. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని సీఎం ఆదేశించడంతో మంత్రులు రంగంలోకి దిగారు. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు.

మంత్రులకు సీఎం దిశానిర్దేశం..

స్పష్టమైన మెజారిటీ లేని దగ్గర, హంగ్ ఏర్పాటయ్యే మున్సిపాలిటీల్లో మిత్రపక్షమైన సీపీఐతోపాటు ఎంఐఎంను కలుపుకొని పోవాలని సీఎం మంత్రులను ఆదేశించినట్లు తెలిసింది. అంతేకాకుండా కలిసివచ్చే ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల కౌన్సిలర్లను కలుపుకొని సాధ్యమైనంత ఎక్కువగా మేయర్, చైర్మన్ పీఠాలను దక్కించుకోవాలని దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. దీని కోసం అవసరమైతే రాజకీయంగా రిస్క్ తీసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో ముఖ్యమంత్రితో సమావేశం కంటే ముందు తమతమ నియోజకవర్గాలకే పరిమితమైన మంత్రులు.. సీఎం భేటీ తర్వాత తమ వ్యూహాలను మార్చారు. స్వతంత్రులతోపాటు ఇతర పార్టీల కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. సుమారు 25 మున్సిపాలిటీల్లో అధికార పార్టీకి అవకాశాలున్నాయని గుర్తించగా.. అక్కడ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్‌లో సరికొత్త టెన్షన్..

బీఆర్ఎస్ ఇప్పటికే 17 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ సాధించింది. అయితే హంగ్ ఏర్పడే మున్సిపాలిటీల్లో సైతం తమకున్న అవకాశాలను ఆ పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కలిసివచ్చే వారితో వీలైనంత ఎక్కువ పీఠాలను దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నది. తక్కువ సంఖ్యలో సభ్యులు అవసరమున్న దగ్గర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే గెలిచినా.. వారు అధికార పార్టీలోకి జంప్ అయితే ఎలా? అనే ఆందోళన వారిలో కనిపిస్తున్నది. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన తరువాత అధికార పార్టీ నుంచి వచ్చే ఒత్తిళ్లు, నిధులు ఇవ్వకపోవడం వంటి వేధింపులు ఉంటాయనే కారణాలను సాకుగా చూపి పార్టీలు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఎక్కువగా చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునేందుకు ఆర్థికంగా, రాజకీయంగా రిస్క్ తీసుకోవడం లేదని తెలుస్తున్నది. అదే సమయంలో మున్సిపల్ చైర్మన్లు తమ పార్టీకి చెందిన వారైతే భవిష్యత్తులో తమకు రాజకీయంగా పోటీ అవుతారని, తమ పక్కలో బల్లెం పెట్టుకున్నట్లుగా అవుతుందని, ఇదంతా అవసరమా అనే కోణంలో కూడా రిస్క్ తీసుకోవడంలేదని సమాచారం.

ఇండిపెండెంట్లకు భారీగా డిమాండ్..

అయితే సక్సెస్, లేకుంటే బాధేమీ లేదు అనే తరహాలో బీఆర్ఎస్, కాంగ్రెస్.. హంగ్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. స్వతంత్రంగా గెలిచిన వారి చుట్టూ ప్రధాన పార్టీల నేతలు తిరుగుతున్నారు. దీంతో ఆయా పట్టణాలు, నగరాల్లోని కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ఎన్నడూ లేనంత డిమాండ్ పెరిగింది. దీంతో రెండు, మూడు మున్సిపాలిటీల్లోనైతే ఇండిపెండెంట్లు ఏకంగా చైర్మన్ పదవినే కోరుతున్నట్లు తెలిసింది. మరికొందరు భారీగా నగదు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. వీటన్నింటి నేపథ్యంలో బేరసారాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు బీజేపీ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మినహా మరెక్కడా పెద్దగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. సీట్లు తక్కువ రావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది.

Next Story