యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం..

by Taduka Kalyani |   (  Updated:2026-06-10 15:19:31  IST  )

తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం మందమర్రిలోని స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో టామ్‌కామ్ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత జర్మన్ భాషా శిక్షణ తరగతులను ప్రారంభించారు.

యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం..
X

దిశ, మందమర్రి, జూన్ 10: తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం మందమర్రిలోని స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో టామ్‌కామ్ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత జర్మన్ భాషా శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఎల్లందు క్లబ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ, జర్మనీతో పాటు ఇతర యూరోపియన్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు జర్మన్ భాషా పరిజ్ఞానం ఎంతో అవసరమని అన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని యువత అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు విదేశీ ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం జర్మన్ ‘ఆస్‌బిల్డుంగ్’ ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులకు మంత్రి వివేక్ అధికారిక ఆఫర్ లెటర్లను అందజేశారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ, సింగరేణి స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ స్థానిక యువతతో పాటు నిరుద్యోగులకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందిస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇప్పుడు టామ్‌కామ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి జర్మన్ భాషా శిక్షణకు కూడా ఈ కేంద్రం వేదిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమీషనర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఎ. కాంతి వెస్లీ (ఐఏఎస్), అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, తహసీల్దార్ పి. సతీష్ కుమార్ శర్మ, బి. రాములు, డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ రేఖారాణి, టామ్‌కామ్ జనరల్ మేనేజర్ నాగభారతి, మున్సిపల్ కమిషనర్ టి. రాజలింగు, రీజినల్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ రాము, జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ రవి, జిల్లా టామ్‌కామ్ మేనేజర్ అనిల్ కుమార్, సింగరేణి అధికారులు, శిక్షకులు, భాషా శిక్షణ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Next Story