వరద ముప్పులేని నగరమే లక్ష్యం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్

by Kema Shiva Kumar |

‘అసాధారణ వర్షాలు పడుతున్నాయి. ఒకే రోజు 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవుతోంది.

వరద ముప్పులేని నగరమే లక్ష్యం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘అసాధారణ వర్షాలు పడుతున్నాయి. ఒకే రోజు 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవుతోంది. ఇలాంటి తరుణంలో వరద నీరు సాఫీగా సాగేలా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. వరద ముప్పు లేని నగరం అందరి లక్ష్యం కావాలి’ అని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ అన్నారు. జీహెచ్ఎంసీ మెయింటినెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో జ‌న‌వ‌రి నుంచి ప్రారంభంకానున్న డీసిల్టింగ్ పనుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ మెయింటినెన్స్ విభాగం, హైడ్రా అధికారుల‌తో బుధవారం హైడ్రా కార్యాలయంలో జరిగిన కోఆర్డినేష‌న్ మీటింగ్‌లో హైడ్రా కమిషనర్ ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ ఏడాది వర్షాకాలం ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తర్వాత వరద నియంత్రణలో విజయవంత‌మ‌య్యామ‌న్నారు. క్యాచ్ పిట్లు, కల్వర్టులలో సిల్ట్ ను తొల‌గించేదే హైడ్రా పని అయినప్పటికీ.. ప్రధాన నాలాల్లో పూడికను కూడా తొలగించామని చెప్పారు. ఈ వర్షాకాలంలో అనుభవంలోకి వచ్చిన సమస్యలు ఎన్నో పాఠాలు నేర్పాయని.. వచ్చే ఏడాది మరింత సమర్థవంతంగా పని చేయడానికి ఇవన్నీ ఊతమిస్తాయని అన్నారు. డీసిల్టింగ్ పనులను ఏప్రిల్ నాటికి పూర్తి చేసి.. వరద నీరు సాఫీగా సాగడానికి హైడ్రా స‌హ‌కారం అన్ని విభాగాల‌కు అందుతుంద‌న్నారు.

స్థానికుల భాగస్వామ్యంతో..

నాలాల్లో డీసిల్టింగ్ పనులను జనవరి నుంచే మొదలు పెడుతున్నామని, వీటి పర్యవేక్షణలో స్థానికులతో పాటు.. ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేద్దామని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ అధికారులకు సూచించారు. నాలా నెట్ వర్కుకు ఎక్కడైనా ఆటంకాలతో పాటు.. ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించడంలో స్థానికులను భాగస్వామ్యం చేయాలన్నారు. అప్పుడే వాటి నిర్వహణలో అందరూ జాగ్రత్తలు పడతారన్నారు. బస్తీబాట అనే కార్యక్రమాన్ని చేప‌ట్టి నాలాల్లో పూడిక తీసే పనుల్లో స్థానికుల సహకారం అందేలా హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంద‌న్నారు. టోలీచౌకి, గౌరిశంక‌ర్ న‌గ‌ర్ కాల‌నీ నాలాల్లో పూడిక తీసినప్పుడు వారం, ప‌ది రోజుల ఇబ్బందులు పడినా పూర్తి సహకారం అందించారన్నారు. ఇదే పరిస్థితి పాతబస్తీ యాఖుత్పురాలో కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు.. పబ్లిక్ నుంచి సహకారం అందిందన్నారు.

క‌చ్చితంగా నాలాల్లో పూడిక తీయాల్సిందే..

నాలాల్లో పూడిక తీసే పనుల్లో ఎలాంటి రాజీ పడాల్సినవసరం లేదని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ అధికారులకు స్పష్టం చేశారు. ఇది తమ పరిధిలోకి రాదని.. ఇంత పూడికను మేము తీయమని కాంట్రాక్టర్లు అనడానికి వీలు లేకుండా.. పనులు పూర్తి చేయాలని సూచించారు. అమీర్పేటలోని మైత్రివనం వద్ద పూడుకుపోయిన భూగర్భ డ్రైనేజీ లైన్లను క్లియ‌ర్ చేయడం.., సికింద్రాబాద్ లోని ప్యాట్నీ నాలాపై ఉన్న ఆక్రమణలు తొలగించి విస్తరించడంతో ఆ రెండు ప్రాంతాల్లో వరద ముప్పు లేకుండా చేసిన విషయాన్ని కమిషనర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకరిద్దరి సమస్యకంటే వందలు, వేలాది మంది సమస్య పరిష్కారమే లక్ష్యంగా పని చేయాల్సి ఉందన్నారు. మరీ ముఖ్యంగా.. నాలాల్లో పూడికను తొలగించడం ఎంత ముఖ్యమో.. వాటి నిర్వహణకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో హైడ్రా అదనపు డైరెక్టర్ వ‌ర్ల‌ పాపయ్య, జీహెచ్ఎంసీ మెయింటినెన్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ రత్నాకర్, ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌ జ్యోతిర్మయితో పాటు ప‌లువురు జీహెచ్ఎంసీ ఇంజినీర్లు, హైడ్రా ఆర్ఎఫ్వో జయప్రకాష్, డీఎఫ్వోలు, ఎస్ఎఫ్వోలు, హైడ్రా అసెట్ ప్రొటెక్షన్ ఇన్స్పెక్టర్లు పాల్గొని స్థానికంగా తలెత్తిన సమస్యలను వివరించారు.

Next Story