జర్మనీలో పర్యటించండి.. మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

by Gantepaka Srikanth |

జర్మనీలో పర్యటించండి.. మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

జర్మనీలో పర్యటించండి.. మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: విదేశీ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఐటీ, ఏరోస్పేస్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా రంగాలకు ఒక మంచి ఏకో సిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. గురువారం సచివాలయంలో మంత్రిని జర్మన్ ఫ్రీడరిక్-ఎబర్ట్-స్టిఫ్టంగ్ ఫౌండేషన్ ప్రతినిధులు డా.సబీన్ ఫాండ్రిక్, మిర్కో గుంథర్, క్రిస్టోఫ్ మోహ్ర్ తదితరులు కలిశారు. రాష్ట్రం అమలు చేస్తున్న సులభతర పారిశ్రామిక విధానాలను, సంక్షేమ పథకాలను వారికి వివరించారు. అత్యంత ప్రతిభావంతులైన యువత రాష్ట్రంలో ఉన్నందున నైపుణ్యాలకు కొదవలేదని తెలిపారు. జర్మనీ-తెలంగాణ భాగస్వామ్యంలో వాణిజ్యం, పరిశ్రమల ఏర్పాటుకు తాము అన్నివిధాలా సహకరిస్తామని శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇండస్ట్రీ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నెలకొల్పామని.. పరిశ్రమలు తమకు అవసరమైన నైపుణ్యాల్లో యువతకు శిక్షణ ఇచ్చి నేరుగా నియమించుకునే అవకాశం ఇది కల్పిస్తుందని చెప్పారు. దిగ్గజ పారిశ్రమికవేత్త ఆనంద్ మహీంద్ర స్కిల్స్ యూనివర్సిటీకి చైర్మన్‌గా ఉన్నారని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పరిశోధన, వినూత్న ఆవిష్కరణల కోసం ప్రత్యేక ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న నిపుణులకు రీ స్కిల్, అప్ స్కిల్లింగ్ లో ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నామని.. రాష్ట్రంలోని పారిశ్రామిక శిక్షణ కేంద్రాలన్నిటినీ అడ్వాన్సుడ్ ట్రెయినింగ్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. షాప్ ఫ్లోర్ నైపుణ్యం ఇక్కడే అందించి పరిశ్రమలకు మానవ వనరుల కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్ కోసం జీనోమ్ వ్యాలీలో ఇటీవలే ‘1 బయో’ ను ఏర్పాటు చేవామని.. మెడికల్ ఫార్ములేషన్స్, వ్యాక్సిన్ పరిశోధనలకు ఇది వేదికగా ఉపకరిస్తుందన్నారు.

ఫార్మా ఉత్పత్తుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా.. కొత్తగా ఏరో స్పేస్, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు దానిని అధిగమించాయి. రూ.1,300 కోట్లతో ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ విమాన ఇంజిన్ల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ కేంద్రాన్ని నెలకొల్పిందన్నారు. రఫేల్ యుద్ధ విమానాల మరమ్మతులు, ఓవర్ హాలింగ్ ఇక్కడే జరుగుతాయని.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సూచన మేరకు ఎంఎస్ఎంఈల కోసం నూతన విధానాన్ని రూపొందించామని వెల్లడించారు. ఈ రంగంలో ఆటోమేషన్ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని.. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఎంఎస్ఎంఈల ద్వారానే లభిస్తాయని.. రాష్ట్రం ఈ రంగానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చి సహకరిస్తున్నదని చెప్పారు. అలాగే.. నాలుగు లక్షల మంది గిగ్ వర్కర్ల భద్రత, సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని.. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనలో తాము మిగిలిన రాష్ట్రాలతో పడటం లేదని, తమ పోటీ దేశాలతోనే చెప్పారు. అమెరికాలోని ప్రతి ప్రముఖ కంపెనీకి ఇక్కడ కార్యాలయాలున్నాయని.. చవకైన మానవ వనరులు, నైపుణ్యాల లభ్యత వల్ల ఈ రంగంలోకి విస్తృతంగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను శ్రీధర్‌బాబు జర్మన్ ప్రతినిధి బృందానికి వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు పావలా వడ్డీ రాయితీ తదితర వాటిపై వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జర్మనీలో పర్యటించండి

జర్మనీలో పర్యటించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఆహ్వానం అందింది. టెక్నాలజీ, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్‌లో తెలంగాణ - జర్మనీ మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతమయ్యేలా తమ దేశంలో పర్యటించాలని జర్మన్ బుండెస్‎టాగ్ (పార్లమెంట్) సభ్యుడు, ఏఎఫ్‌డీ పార్లమెంటరీ గ్రూప్ ఫారిన్ పాలసీ అధికార ప్రతినిధి, ఇండో-జర్మన్ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ చైర్మన్ మార్కస్ ఫ్రోహ్న్‌మైయర్ ఆయనను ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి శ్రీధర్‌బాబు జనవరిలో జర్మనీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జర్మనీ ప్రభుత్వ పెద్దలు, కీలక అధికారులు, అక్కడి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రి నిపుణులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ హై లెవెల్ మీటింగ్స్‌లో ఇండస్ట్రియల్ పార్టనర్షిప్స్, తెలంగాణలో ఇన్వెస్ట్‌మెంట్ అపార్చునిటీస్, జర్మనీలో తెలంగాణ కంపెనీలకు మార్కెట్ యాక్సెస్ కల్పించడం, జర్మనీ - తెలంగాణ మధ్య టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, ద్వైపాక్షిక సహకార బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నారు.

Next Story