హాట్ టాపిక్‌గా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ అగ్నిప్రమాదం.. కాలిబూడిదవుతున్న కీలక కేసుల ఆధారాలు?

by Kema Shiva Kumar |

నాంపల్లిలో ఉన్న స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో భారీ అగ్నిప్రమాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

హాట్ టాపిక్‌గా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ అగ్నిప్రమాదం.. కాలిబూడిదవుతున్న కీలక కేసుల ఆధారాలు?
X

దిశ, వెబ్‌డెస్క్: నాంపల్లిలో ఉన్న స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో భారీ అగ్నిప్రమాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈ ప్రమాదం కేవలం ఆస్తి నష్టానికే పరిమితం కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కీలక కేసుల విచారణను దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రవేశ్‌తో పాటు పత్యేక రాష్ట్ర ఏర్పాటు అయ్యాక రాజకీయ ప్రకంపనలు సృష్టించిన అనేక కేసులకు సంబంధించిన కీలక ఆధారాలు ప్రస్తుతం ఆ ల్యాబ్‌లోనే ఉన్నాయి.

కీలక కేసుల్లో ఆధారాలు అక్కడే..

ఇటీవలి కాలంలో అత్యంత వివాదాస్పదమైన ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, డిజిటల్ డేటా విశ్లేషణ ఇక్కడే జరుగుతోంది. అదేవిధంగా గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఓటుకు నోటు కేసులోని ఆడియో, వీడియో రికార్డింగ్‌ల ఒరిజినల్ ఫైల్స్ ఇక్కడి కంప్యూటర్లలోనే నిక్షిప్తమై ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, వాటికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టులు ఇక్కడే ఉన్నాయి. అయితే, కీలక కేసుల విచారణ ముమ్మరంగా సాగుతున్న తరుణంలో, ఆధారాలకు నిలయమైన FSL ల్యాబ్‌లో మంటలు చెలరేగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇక్కడి కంప్యూటర్లు, సర్వర్లు పూర్తిగా దగ్ధమైతే, ఆయా కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేసే కీలకమైన డిజిటల్ సాక్ష్యాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అయితే, ఈ ప్రమాదం యాదృచ్ఛంగా జరిగిందా.. ఎవరైనా కుట్రపూరితంగా చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌కు అడ్డంకులు..

అయితే, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు స్పాట్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. లోపల ఉన్న రసాయనాలు, ఎలక్ట్రానిక్ పరికరాల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఏయే విభాగాలకు నష్టం వాటిల్లింది..? ఏయే కేసుల డేటా సురక్షితంగా ఉంది? అన్న దానిపై అధికారులు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Next Story