BJP: బీజేపీలో మొదలైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ .. తొలుత ఆ స్థానాలకు అభ్యర్థులు

by Prasad Jukanti |   (  Updated:2025-10-01 07:57:51  IST  )

బీజేపీలో స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఖరారుపై స్టేట్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

BJP: బీజేపీలో మొదలైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ..  తొలుత ఆ స్థానాలకు అభ్యర్థులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు తెలిపారు. ఇవాళ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన... తొలుత జడ్పీటీసీ అభ్యర్థులను డిక్లేర్ చేస్తామన్నారు. వార్డు మెంబర్ నుండి జడ్పీటీసీ దాకా అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శించారు. బీఆర్ఎస్ కేంద్ర ఇచ్చిన నిధులను దారి మళ్లించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కల్పించారని, తాజామాజీ సర్పంచులు పడిన యాతన వర్ణణాతీతం అన్నారు. కనీసం పంచాయతీలకు కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితికి తెచ్చారని దుయ్యబట్టారు. ప్రజలు బీజేపీని ఆదరించాలని కోరారు.

బీఆర్ఎస్ దోపిడీ.... కాంగ్రెస్ మోసాలు:

బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తే.... కాంగ్రెస్ పార్టీ మోసాలు చేస్తోందని రామచందర్ రావు విమర్శించారు. అనేక వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలేదని ఆరోపించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అతా కేంద్ర నిధులేనన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఎరువుల పేరుతో రూ.40 వేల కోట్లు సబ్సిడీ ఇస్తుంటే ఎరువుల పంపిణీ చేతగాక కృత్రిమ కొరత సృష్టించారని దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ దేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్ర నిధులు తీసుకొస్తామని చెప్పారు. గ్రామాలు బాగుపడాలంటే బీజేపీని గెలిపించాలన్నారు.

బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం:

42 శాతం రిజర్వేషన్ల సవరణ అప్పుడే చేస్తే ఈ సమస్య వచ్చేది కాదని, స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టే రెండేళ్ల జాప్యం చేశారని విమర్శించారు. ఎన్నికల నిర్వహణ ఇష్టం లేకపోయినా హైకోర్టు ఆదేశించించడంతో తప్పనిసరై నిర్వహిస్తున్నారు. కేంద్ర నిధుల కోసమే నిర్వహిస్తున్నారన్నారు. బీజేపీ బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉందన్నారు. ఎన్నికలు జరగాలన్నదే బీజేపీ అభిమతం అని కోర్టుకు కాంగ్రెస్ నేతలే వెళ్లినట్లున్నారని అన్నారు. దేశంలో రిజర్వేషన్లకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అనేక సామాజిక సమస్యలుంటాయని రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనన్నారు. రాష్ట్రంలో బీసీఈ ముస్లింలకు ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్‍కు మాత్రమే పరిమితం చేశారు. కానీ ఇప్పుడు వాళ్లకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. దీనికి బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. స్థానిక ఎన్నికలపై కోర్టు ఏ విధంగా స్పందిస్తోందో వేచి చూడాలని కోర్టు నిరఅణయాన్ని ముందుగానే చెప్పలేమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ అవినీతి పాల్పడింది. ఈ ప్రాజెక్టు మొత్తం విచారణ చేయాలి. కానీ మేడిగడ్డ, సుందిళ్లకే పరిమితం చేయడం సరికాదు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ప్రకారం వాటిని రిపేర్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకం అని చెప్పారు. బీజేపీలో చేరే వారు వారి పదవులకు రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

Next Story