- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంట మారాలి... రాత మారాలి: రైతు సంక్షేమ కమిషన్
రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే పంటల మార్పిడి అనివార్యమని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ స్పష్టం చేసింది. పంటల వైవిధ్యీకరణపై కమిషన్ రూపొందించిన సమగ్ర నివేదికను బీఆర్కే భవన్‌లో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి విడుదల చేశారు. ..

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే పంటల మార్పిడి అనివార్యమని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ స్పష్టం చేసింది. పంటల వైవిధ్యీకరణపై కమిషన్ రూపొందించిన సమగ్ర నివేదికను బీఆర్కే భవన్‌లో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాములు నాయక్, కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, భవానీ రెడ్డి, మెంబర్ సెక్రటరీ గోపాల్, స్పెషల్ అధికారి కేశవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ కేరళ, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అధ్యయనం చేసి పంటల మార్పిడిపై నివేదిక సిద్ధం చేసినట్లు తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి రాకముందు వర్షాధార, సాంప్రదాయ పంటల సాగు అధికంగా ఉండేదని, కాలక్రమేణా రైతులు వరి, పత్తి పంటల వైపు మళ్లారని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో సాగైన పంటలు, ప్రస్తుతం సాగవుతున్న పంటల వివరాలను నివేదికలో పొందుపరిచినట్లు వివరించారు. రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల తోటల సాగు తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. కోతుల బెడద కారణంగా పలు పంటల సాగుకు రైతులు వెనుకంజ వేస్తున్నారని ఈ సమస్య పరిష్కారానికి సోలార్ ఫెన్సింగ్, కోతుల కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టాలని కమిషన్ సూచించినట్లు తెలిపారు. వరి, పత్తి నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు, గిట్టుబాటు ధరలు కల్పించాలని నివేదికలో ప్రతిపాదించినట్లు చెప్పారు.
రైతుల సమస్యలను రాజకీయాలకు అతీతంగా చూడాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 23 పంటలకు మద్దతు ధర ప్రకటిస్తున్నప్పటికీ, కేంద్రం వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లకే పరిమితమవుతోందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో లారీలు, హమాలీల కొరత వంటి సమస్యలు ఉన్నప్పటికీ, వాటిని అధిగమిస్తూ కొనుగోళ్లు కొనసాగుతున్నాయని చెప్పారు. మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. తాను చేసిన విద్యుత్ వినియోగానికి సంబంధించిన వ్యాఖ్యలను కొన్ని ప్రచార సాధనాలు వక్రీకరించాయని రైతు సమస్యలపై పూర్తి అవగాహనతోనే మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. అనంతరం కమిషన్ సభ్యుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, పంట అవశేషాలను కాల్చవద్దని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ, రైతులు ఇంకా ఆ పద్ధతిని కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు ప్రమాదాలు సంభవించి ప్రాణనష్టాలు కూడా చోటుచేసుకుంటున్నాయని హెచ్చరించారు. వర్షాలు కురిసిన తర్వాత పంట అవశేషాలను భూమిలో కలిపి దున్నడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవచ్చన్నారు.






