మంత్రి పదవి కోసం హస్తిన బాట.. రాహుల్ గాంధీతో రాజగోపాల్ రెడ్డి భేటీ

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరిగే అవకాశాలున్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో పలువురు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హస్తినలోని కాంగ్రెస్ పెద్దలను కలిసి తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ విన్నవించుకుంటున్నారు.

మంత్రి పదవి కోసం హస్తిన బాట.. రాహుల్ గాంధీతో రాజగోపాల్ రెడ్డి భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరిగే అవకాశాలున్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో పలువురు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హస్తినలోని కాంగ్రెస్ పెద్దలను కలిసి తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ విన్నవించుకుంటున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. దీనితో తన మంత్రిపదవి కోసం ఆయన రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనకు మంత్రి పదవి ఇవ్వాలని, తాను కాంగ్రెస్ లో చేరే సమయంలో మంత్రిపదవి ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా అనేక వేదికలపైన ఆయన స్పష్టం చేశారు. మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ ఆయన అనేక సార్లు బహిరంగంగానే మాట్లాడారు. దీనితో తాజాగా రాహుల్ గాంధీతో భేటీతో మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కే అవకాశాలపైన కాంగ్రెస్ లో నేతలు చర్చించుకుంటున్నారు. ఇక మంత్రివర్గంలో తమకు చోటు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో ఢిల్లీ బాట పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో తనకు చోటో కల్పించాలని ఆయన తన ఫ్యామిలీతో రాహుల్ గాంధీని కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదని రామ్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీకి తెలిపారు. దీంతో రామ్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ భేటీ అటు కాంగ్రెస్ లో, ఇటు రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది.

మంత్రి పదవి కోసం అధిష్టాన పెద్దలను కలిసి నేతలు వినతి పత్రాలు ఇవ్వడం, విజ్ఞప్తులు చేస్తుండటంతో చాలా మంది ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాగా, త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంటూ ఉహాగానాల నేపధ్యంలో ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చిందని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనితో ఆయన ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవడంతో ఆయనకు మంత్రివర్గంలో చోటు ఖాయమంటూ చర్చ జరుగుతోంది. ప్రసాద్ కుమార్ గతంలో ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ఆయన పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రసాద్‌కుమార్‌ తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని రాహుల్‌ను కోరినట్లుగా సమాచారం. ఆ తర్వాత ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని కూడా కలిశారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి కోటాలోనే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కూడా తనకు మంత్రిపదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. గతంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు కల్పించకపోవడంతో బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనితో పార్టీ నేతలు వెళ్లి ఆయనను బుజ్జగించారు. తాజాగా శనివారం కోహెడలో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎదుట మల్ రెడ్డి రంగారెడ్డి వర్గీయులు ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. కాగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో తమకు మంత్రిపదవి ఇవ్వాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు తీవ్ర స్థాయిలో తమ ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరికొందరు ఢిల్లీ బాట పట్టే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Next Story