- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇష్టం ఉన్నా లేకున్నా ఫాలో కావాల్సిందే.. ఎమ్మెల్యే కోమటిరెడ్డికి మంత్రి జూపల్లి కౌంటర్!
మద్యం విక్రయాలపై మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పెట్టిన షరతులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: మద్యం విక్రయాలపై మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పెట్టిన షరతులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తున్నది. ఎవరి ఇష్టం ఉన్నట్లు వారు సొంతంగా రూల్స్ పెడితే కుదరదని, రాష్ట్రం మొత్తం ఒకే పాలసీ ఉంటుందని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. తన నియోజకవర్గంలో లిక్కర్ షాపులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే విక్రయించాలని, పర్మిట్స్ రూమ్స్‌కు అనుమతి లేదని రాజగోపాల్ రెడ్డి ఇటీవల కండీషన్లు పెట్టారు. దీంతో కొందరు వ్యాపారులు స్థానికంగా ఉన్న షాపులకు టెండర్లు వేసేందుకు వెనుకంజ వేశారు. విషయం గ్రహించిన ఎక్సైజ్ అధికారులు మునుగోడులో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వంలోని కీలక నేతలకు సమాచారం ఇచ్చారు. సదరు వ్యాపారుల అభ్యంతరాలను పూర్తిగా విన్న నేతలు ‘స్టేట్ మొత్తం ఒకటే రూల్స్ ఉంటయ్. ఇష్టం ఉన్నట్లు సొంత పాలసీలు పెడితే నడవవ్. అనవసరంగా భయపడొద్దు. షాపులకు దరఖాస్తు చేసుకోండి. డ్రా లో వచ్చిన వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తాం’.. అంటూ వారికి భరోసా ఇచ్చినట్టు తెలిసింది.
అందరూ ఫాలో కావాల్సిందేనన్న మంత్రి జూపల్లి
మునుగోడు ఎమ్మెల్యే కామెంట్స్‌ను పలువురు వ్యాపారులు.. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘స్టేట్ మొత్తం ఒకటే మద్యం పాలసీ ఉంటుంది. నియోజకవర్గానికి ఒక్కో తీరుగా ఉండదు. ఒక్కో లీడర్‌కు ఒక్కో ఆలోచన ఉండొచ్చు. కానీ చట్టం అందుకు ఒప్పుకోదు. ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ ఫాలో కావాల్సిందే’ అని కామెంట్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నది.
మంత్రి పదవి రాలేదని అక్కసు?
మంత్రి పదవి రాలేదనే అక్కసుతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. లిక్కర్ విక్రయాలపై ఆయన రూల్స్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని, వ్యాపారుల్లో అయోమయం నెలకొందని రిపోర్టులో వివరించినట్లు తెలిసింది. అలాగే ఆయన కొంత కాలంగా చేస్తోన్న కామెంట్స్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నట్లు విమర్శలున్నాయి. ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి తనకు ఇవ్వకపోవడం సరికాదని రాజగోపాల్ రెడ్డి తనలో ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని కష్టపడిన తనను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. అంతకంటే ముందు కొన్ని సార్లు సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై పరోక్ష విమర్శలు చేశారు. రాజగోపాల్‌రెడ్డి వ్యవహార శైలీపై అధిష్టానానికి పూర్తి నివేదిక పంపినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.






