- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్యవిద్యార్థుల ‘సుదీర్ఘ’ గోస.. విరామం లేకుండా 36 గంటల విధులు!
తెలంగాణ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యార్థులపై పని భారం తీవ్రంగా పడుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: విశ్రాంతి లేకుండా విధులు నిర్వహించలేకపోతున్నామని వైద్యవిద్యార్థులు వాపోతున్నారు. రాష్ట్రంలోని బోధన ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందిస్తున్న సీనియర్ రెసిడెంట్లు, పీజీ వైద్య విద్యార్థులు, ఇంటర్న్‌లు తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడం, అపరిమితమైన పనివేళల కారణంగా వారు శారీరకంగా, మానసిక అలసట తీవ్రంగా పెరుగుతున్నది. నిరంతరంగా 24 నుంచి 36 గంటల పాటు ఎలాంటి విశ్రాంతి లేకుండా విధులు నిర్వహించాల్సి రావడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. పలుచోట్ల వీరు పనిభారం కారణంగా ఆత్మహత్యాయత్నాలకూ ఒడిగడుతున్నారు. కేవలం డాక్టర్ల ఆరోగ్యమే కాకుండా విపరీతమైన అలసట కారణంగా రోగులకు అందించే వైద్యసేవల పరంగా నాణ్యత కూడా తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
‘జిప్మర్’ విధానం భేష్..
ప్రస్తుతం ఈ విపత్కర పరిస్థితుల్లో పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్మర్) గత నెల 28న తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిప్మర్ తన రెసిడెంట్ డాక్టర్ల పనివేళలను క్రమబద్ధీకరించింది. ఏ డాక్టరైనా రోజుకు 12 గంటలకు మించి పనిచేయకూడదు. వారానికి గరిష్టంగా 48 గంటల డ్యూటీ మాత్రమే ఉండాలి. ప్రతి వారం రొటేషన్ పద్ధతిలో ఒకరోజు కచ్చితంగా సెలవు ఇవ్వాలి. ఆన్ కాల్ డ్యూటీ కూడా 12 గంటలకు మించి ఉండకూడదని ఆదేశాలు జారీచేసింది.
డీఎంఈకి హెచ్‌ఆర్‌డీఏ విన్నపం
జిప్మర్ మాదిరిగానే తెలంగాణలోనూ పనివేళలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్(హెచ్ఆర్డీఏ) రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో షిఫ్టుకు 12 గంటలు, వారానికి 48 గంటల పనివిధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ తెలంగాణ వైద్య విద్యాసంచాలకులకు(డీఎంఈ- అకడమిక్) అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. డాక్టర్ల సంక్షేమం, రోగుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే స్పందించి, జిప్మర్ తరహాలో ఉత్తర్వులు జారీచేయాలని వారు కోరారు.
ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఇవే..
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం, మెడికల్ కాలేజీల్లోని రెసిడెంట్ డాక్టర్ల పనిభారం, విశ్రాంతిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ముఖ్యంగా రెసిడెన్సీ స్కీమ్ కింద కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన ఉత్తర్వులనే ఎన్ఎంసీ ప్రామాణికంగా పరిగణిస్తుంది.
-రెసిడెంట్ డాక్టర్ల నిరంతర విధి నిర్వహణ సాధారణంగా రోజుకు 12 గంటలకు మించకూడదు.
-జూనియర్ రెసిడెంట్లు వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పనిచేయాలి.
-డాక్టర్లు నిరంతరాయంగా 12 గంటలకు మించి పని చేయకూడదు.
-ఆన్ కాల్ డ్యూటీ సమయం కూడా ఒకేసారి 12 గంటలకు మించకుండా ఉండాలి.
- ప్రతి రెసిడెంట్ డాక్టర్‌కు రొటేషన్ పద్ధతిలో వారానికి ఒకరోజు కచ్చితంగా సెలవు కల్పించాలి.
- డాక్టర్లలో పని ఒత్తిడి తగ్గించి వారికి మెరుగైన జీవన సమతుల్యతను అందించడానికి ఈ నిబంధనలను అక్షరాలా అమలు చేయాలని ఎన్ఎంసీ సూచిస్తోంది.తెలంగాణలో ఈ నిబంధనలు అమలు కాకపోవడం వల్ల, ప్రస్తుతం రెసిడెంట్ డాక్టర్లు 24 నుంచి 36 గంటల పాటు పనిచేయాల్సి వస్తోందని, వారాంతపు సెలవులు కూడా ఉండటం లేదని వైద్యవిద్యార్థులు వాపోతున్నారు.






