- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుప్పకూలిన హనుమాన్ ఆలయ స్లాబ్.. శిథిలాల కింద 30 మంది భక్తులు!
భక్తులు పూజలు చేసుకుంటున్న సమయంలో ఓ హనుమాన్ ఆలయ స్లాబ్ (కప్పు) ఒక్కసారిగా కూలిపడింది.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని పర్భాణి జిల్లాలో శనివారం ఒక ఘోర ప్రమాదం సంభవించింది. భక్తులు పూజలు చేసుకుంటున్న సమయంలో ఓ హనుమాన్ ఆలయ స్లాబ్ (కప్పు) ఒక్కసారిగా కూలిపడింది. ఈ దురదృష్టకర ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం కావడంతో ఉదయమే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిన సమయంలో ఈ ప్రమాదం జరగడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. పర్భాణి జిల్లాలోని సేలు తాలూకా పరిధిలో గల రావల్గావ్ గ్రామంలో ఈ పురాతన హనుమాన్ దేవాలయం ఉంది. శనివారం ఉదయం భక్తులు ఆలయ గర్భగుడి వెలుపల నిలబడి ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో, పైన ఉన్న కాంక్రీట్ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలి వారిపై పడింది.
ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకుని రావల్గావ్‌కు చెందిన ఉత్తమ్ రావు లహనే (65) అనే వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. మిగిలిన ఐదుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. మొత్తం 30 మంది భక్తులు శిథిలాల కింద ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం జాల్నాలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో ఇద్దరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆలయం చాలా పాతది కావడం, ఇటీవలి వర్షాల వల్ల కాంక్రీట్ బలహీనపడటమే స్లాబ్ కూలిపోవడానికి ప్రాథమిక కారణంగా భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.






