సామాన్యుడికి మరో షాక్.. దేశవ్యాప్తంగా పెరగనున్న పాలధరలు!

by Prasad Jukanti |   (  Updated:2026-06-20 11:31:12  IST  )

ఇంధన ధరలతో పాటు నిత్యవసర ధరలు చుక్కలు చూపిస్తున్న వేళ సామాన్యులకు త్వరలో మరో షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది.

సామాన్యుడికి మరో షాక్.. దేశవ్యాప్తంగా పెరగనున్న పాలధరలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో పాటు ఇంధన ధరలు ఆకాశాన్ని అంటిన నేపథ్యంలో తాజాగా సామాన్యుడికి మరో షాక్ తగలబోతోంది. దేశంలో పాల ధరలు మరోమారు పెరగబోతున్నట్లు తెలుస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న 'ఎల్ నినో' (El Nino) ప్రభావం వల్ల దేశంలో రుతుపవనాలు బలహీనపడి, వర్షపాతం తగ్గడం వల్ల పాల ధరలు పెంచడం అనివార్యం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే గత నెలలో పాల ధరలు లీటర్ కు 2 నుండి 3 శాతం వరకు పెరగగా, రాబోయే జూలై లేదా ఆగస్టు నాటికి ఇవి మరింత ప్రియమయ్యే అవకాశం ఉందని డెయిరీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పశుగ్రాసం కొరతతో తగ్గుతున్న ఉత్పత్తి:

సాధారణంగా వర్షాలు సరిగ్గా పడకపోతే పశుగ్రాసం, తాగునీటి కొరత తీవ్రమవుతుంది. దీంతో పాల ఉత్పత్తి తగ్గడంతో పాటు ఈ భారం భరించలేక రైతులు తమ పశువుల సంఖ్యను తగ్గించుకుంటారు. ప్రస్తుతం దేశంలో నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో లేవు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలోని ప్రముఖ డెయిరీల వివిధ రకాల పాల ప్యాకెట్ల ధరలు జులై చివరి నాటికి పాల ధరలు మరో 3 నుండి 4 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని 'పరాగ్ మిల్క్ ఫుడ్స్' (గో చీజ్, గోవర్ధన్ బ్రాండ్స్ అధినేత) ఛైర్మన్ దేవేంద్ర షా ఆందోళన వ్యక్తం చేశారు.

అప్రమత్తమైన డైరీ కంపెనీలు, ప్రభుత్వాలు:

పరిస్థితిని ముందే ఊహించిన మహారాష్ట్ర ప్రభుత్వం రైతులు అప్రమత్తం చేసింది. పశుగ్రాసం కొరత ఏర్పడే ముప్పు ఉందని, రైతులు ఇప్పుటి నుంచే ప్రత్యామ్నాయ పశుగ్రాస పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ కమిషనర్ కిరణ్ పాటిల్ హెచ్చరించింది. మరోవైపు ప్రముఖ డైరీ బ్రాండ్లు అయిన అమూల్ (Amul), మదర్ డైరీ (Mother Dairy) సంస్థలు కూడా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన అమూల్ ఎంజీ జయేన్ మోహతా.. ప్రస్తుతానికైతే ఎల్ నినో ప్రభావం పాల లభ్యతపై పడలేదని వర్షపాత కొరత అనేది కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుంది కాబట్టి రుతుపవనాల పురోగతిని చూసి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. మదర్ డైరీ ఎండీ జయతీర్థ చారి మాట్లాడుతూ. తమ పాలు సేకరించే నెట్‌వర్క్ పరిధిలోని రాష్ట్రాలలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, అవసరమైన చోట ముందస్తు నివారణ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ఎండల తీవ్రత కారణంగా తమిళనాడుకు చెందిన 'ఆవిన్' (Aavin) డైరీ పాల సరఫరాను తగ్గించగా, మిగిలిన ప్రముఖ బ్రాండ్లు కూడా ధరల పెంపునకు మొగ్గు చూపుతుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story