రూటు మారిన లిక్కర్ స్కామ్.. ఇక్కడ అరెస్ట్ అక్కడ దర్యాప్తు

by Disha Web Desk |
రూటు మారిన లిక్కర్ స్కామ్.. ఇక్కడ అరెస్ట్ అక్కడ దర్యాప్తు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మద్యం కుంభకోణంపై దర్యాప్తు ప్రక్రియ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మారింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉందన్న అనుమానంతో ఈడీ బృందాలు ఫార్మా కంపెనీ యజమాని శరత్ చంద్రారెడ్డిని అదుపులోకి తీసుకొని ఢిల్లీలో ప్రశ్నించినట్లు హైదరాబాద్ వర్గాల సమాచారం. దీనికి కొనసాగింపుగా గురువారం కూడా ఆయన ఎంక్వయిరీ కొనసాగనున్నదని, ఆ తర్వాత సోమవారానికి వెన్నమనేని శ్రీనివాసరావును కూడా ఢిల్లీలోనే ప్రశ్నించే అవకాశం ఉన్నదని తెలిసింది. ఈ మేరకు శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఢిల్లీ కేంద్ర కార్యాలయానికి చెందిన ఇన్వెస్టిగేషన్ బృందాలు ఎంక్వయిరీ బాధ్యతలు చేపట్టాయి. ఇప్పటివరకూ హైదరాబాద్‌లో సోదాల కోసం వచ్చిన స్పెషల్ టీమ్స్ లో కొన్ని తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయాయి. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ తదుపరి దర్యాప్తు, రెయిడ్‌ల కోసం కొన్ని బృందాలు ఇక్కడే ఉండిపోయాయి.

లిక్కర్ కుంభకోణంలో హైదరాబాద్‌లో ఈడీ బృందాలు అదుపులోకి తీసుకున్న వెన్నమనేని శ్రీనివాసరావును ఏడు గంటల పాటు ప్రశ్నించి ఇక్కడి నుంచి డబ్బులు ఢిల్లీకి ఎలా వెళ్లాయి.. ఎవరి ద్వారా వెళ్లాయి, ఎవరి నుంచి సేకరించినవి.. ఏ అవసరాల కోసం ఉద్దేశించినవి.. ఇందులో హవాలా మార్గం వినియోగమైందా తదితరాలన్నింటిపై వివరాలను సేకరించారు. ఇప్పుడు వీటి ఆధారంగా సోమవారం ఢిల్లీ టీమ్‌లు అక్కడే ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు ఇప్పటివరకు అందిన ప్రాథమిక సమాచారం. మద్యం కుంభకోణంపై దర్యాప్తుకంటే మనీ లాండరింగ్, హవాలా మార్గం, డబ్బు రవాణా తదితరాలపైనే ఈడీ ఎక్కువ ఫోకస్ పెట్టింది. శ్రీనివాసరావు మొబైల్ ఫోన్ డాటాను, బ్యాంకు ఖాతాల వివరాలను ఇప్పటికే తీసుకున్న ఈడీ ఆయన కదలికలను బుధవారం నిశితంగా పరిశీలించినట్లు తెలిసింది. ఎంక్వయిరీ తర్వాత ఆయన ఎవరితో టచ్‌లోకి వెళ్లారు.. ఎవరి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి..? తదితరాలపై ఆయనకు సంబంధించిన కదలికలపై నిఘా పెట్టినట్లు తెలిసింది.

ఇకపైన ఢిల్లీ వేదికగా జరిగే దర్యాప్తుకు లిక్కర్ స్కామ్‌‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న సంబంధాలపై గండ్ర ప్రేమ్ సాగర్, బోయిన్‌పల్లి అభిషేక్, శ్రీధర్, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై తదితరులను కూడా ఎంక్వయిరీ కోసం పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమాన టికెట్లను బుక్ చేసిన జోనా ట్రావెల్స్ ప్రతినిధుల నుంచి కూడా ఈడీ వివరాలను సేకరించింది. నిధుల మళ్లింపులో వరుణ్‌సన్ సాప్ట్ వేర్ టెక్నాలజీస్, శాలిగ్రామ్ టెక్నాలజీస్‌కు ఉన్న పాత్రపై ఈడీ టీమ్స్ ఆరా తీశాయి. రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారాలతో ఉన్న సంబంధాలపైనా ఈడీ ఫోకస్ పెట్టింది.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. భారీగా పీఎఫ్ఐ సభ్యుల అరెస్ట్..



Next Story