ఆదాయం ఉన్నా.. చెరువుగట్టు ఆలయ అభివృద్ధి మాత్రం శూన్యం

by Malleboina Mahesh |

చెరువుగట్టు క్షేత్రంపై పాలకుల నిర్లక్ష్యం! రూ.18 కోట్ల ఆదాయం ఉన్నా భక్తులకు కష్టాలు తప్పడం లేదు. 100 కోట్ల అభివృద్ధి హామీలు ఎప్పుడు నెరవేరుతాయో ఆ శివయ్యకే తెలియాలి.

ఆదాయం ఉన్నా.. చెరువుగట్టు ఆలయ అభివృద్ధి మాత్రం శూన్యం
X

దిశ, నార్కట్ పల్లి: తెలంగాణ శ్రీశైల క్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి నీలి నీడలు కమ్ముకున్నాయని చెప్పవచ్చు. కొన్నేళ్లుగా అభివృద్ధి చేస్తామనే మాటలు నీటి మూటలుగానే మారుతున్నాయి. క్షేత్ర పరిసరాలు పరిశీలించడం, సమీక్షలు ఏర్పాటు చేయడం తప్ప అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. దీంతో ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి నెల అమావాస్యకు లక్షల సంఖ్యల్లో వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.

ఈ దేవాలయానికి డీసీ క్యాడర్ ఈవో ఉండాలి కానీ..ఇన్చార్జి ఈవోలే గత కొన్నేళ్లుగా ఉండడమే కారణమనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఏటా భక్తుల సంఖ్య పెరగడంతో పాటు ఆదాయం అదే విధంగా వస్తుందని అయినా అభివృద్ధి మాత్రం మచ్చుకైనా కనిపించడం లేదనే విమర్శలను అధికారులు మూటగట్టుకుంటున్నారు. వీటన్నింటికి తోడు ఈ దేవాలయంలో విపరీతమైన రాజకీయ జోక్యమే అభివృద్ధి కుంటుపడుతుంది అనేది బహిరంగ రహస్యమే.

ప్రణాళికలు లేని పనులు..

గత కొంతకాలంగా ఇన్చార్జి ఈవోలే ఈ దేవాలయానికి పాలకులుగా ఉంటున్నారు. దీంతో సరైన ప్రణాళికలు లేకుండా పనులు చేసి వదిలేస్తున్నారు. దీనివల్ల భక్తులకు సరైన వసతులు కలగక ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడకు వచ్చే భక్తులకు కనీసం మంచినీటి వసతిని కల్పించడంలోనూ పాలకులు విఫలమవుతున్నారు. దివిస్ కంపెనీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. గట్టుపై ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుగా ప్రణాళికలు చేసినప్పటికీ రాజకీయ జోక్యమా ?వాటర్ బాటిల్ కాంట్రాక్టర్ ఒత్తిడా..? తెలియదు కానీ వాటర్ ప్లాంట్ ను ఘాట్ రోడ్డు మధ్యలో నిర్మించారు. దీంతో ఆ వాటర్ ప్లాంట్ భక్తులకు పూర్తిగా ఉపయోగపడడం లేదు.

అదేవిధంగా గట్టుపై ఆర్చిని ఏర్పాటు చేసేందుకు పిల్లర్లు వేశారు. మరి ఏమైందో తెలియదు దాదాపు 10 ఏళ్లుగా వాటిని అలాగే వదిలేశారు. దీనివల్ల అమావాస్య రోజుల్లో భక్తులకు తిప్పలు తప్పడం లేదు. దేవాలయానికి వెళ్లే ప్రధాన ద్వారంలో మరుగుదొడ్ల ద్వారా దుర్వాసన వస్తుందని భక్తులు పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన టాయిలెట్లు ఉన్నప్పటికీ వాటిని ప్రారంభించక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఇలా చూస్తే ఇక్కడ చేసే పనులు ప్రణాళికలు లేకుండా చేస్తున్నారా ..!మరి ఏదైనా రాజకీయ జోక్యమా..? తెలియ రావడం లేదు.

రూ.100 కోట్లతో అభివృద్ధి..

గత పదేళ్లుగా ఈ దేవాలయాన్ని 100 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి మాత్రం జరగడం లేదు. నాలుగు నెలల క్రితం ఎండోమెంట్ కమిషనర్ శైలజ రామయ్యర్ ఈ దేవాలయాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు. రాబోయే 30 ఏళ్ల వరకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా వాస్తు లోపాలు లేకుండా స్తపతులు, పండితుల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేయాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. కానీ నేటికీ పనులు ప్రారంభించ కపోవడంతో అభివృద్ధి జాడే కనిపించడం లేదు.

100 కోట్లతో చేసే పనులకు అంచనా తయారు చేయగా రెండో ఘాట్ రోడ్డు, ఘాట్ రోడ్ వద్ద ఆర్చి ల నిర్మాణం, మెట్ల మార్గం, మూడు గుండ్ల క్యూ కాంప్లెక్స్, భక్తులకు వసతి గృహాలు ఇలా అన్నింటికీ అంచనాగా ఒక ప్లానింగ్ తయారు చేయగా రూ.140 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇందులో ఎండోమెంట్ రూ.100 కోట్లకు పైగా, ఇరిగేషన్ ఏడు కోట్లు, ఆర్ అండ్ బీ రూ.10 కోట్లు, టీజీటీడిస్ రూ.3.75 కోట్లు, డెమోలేషన్ వర్క్స్ రూ.1.35 కోట్లుగా ఒక అంచనాకు వచ్చారు. కానీ ఆ నిధులు వచ్చేది ఎప్పుడు..! పనులు జరిగేది ఎప్పుడు..! భక్తుల సమస్యలు తీరేది ఎప్పుడు.. ఆ శివయ్యకే తెలియాలి...

ఏటా రూ.18 కోట్ల ఆదాయం.. భక్తులకు వసతులు శూన్యం..

ప్రతి ఏటా ఈ దేవాలయానికి టెండర్లు, సేవల ద్వారా రూ.18 కోట్ల ఆదాయం వస్తుంది. అయినా భక్తులకు వసతులు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఇంచార్జ్ ఈవోలు ఉండటం వల్ల దేవాలయానికి వచ్చే ఆదాయం పక్కదారి పడుతుందని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ టెండర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా రాబట్టుకోవడంలో దేవాలయ అధికారులు విఫలమవుతున్నారు. విపరీతమైన రాజకీయ జోక్యం వల్ల ఇక్కడ అవినీతి అధికంగానే జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి. ఏటా వచ్చే ఆదాయం ఎటు వెళ్తుందో తెలియడం లేదని భక్తులు ఆరోపణ చేస్తున్నారు.

Next Story