రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్

by Naga Rani Yarlagadda |

తెలంగాణ విద్యుత్ వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం ఏకంగా 11 వేలకు పైగా మెగావాట్ల విద్యుత్ కు డిమాండ్ ఏర్పడింది.

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
X
  • శుక్రవారం టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 11,129 మెగావాట్ల లోడ్
  • గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో పాటు రబి పంటల సాగు వేగం పెరగడం వల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. వ్యవసాయ అవసరాలకు తోడు గృహ, వాణిజ్య మరియు పారిశ్రామిక రంగాల్లో వినియోగం పెరగడంతో విద్యుత్ డిమాండ్ రోజురోజుకు రికార్డు స్థాయికి చేరుతోంది. ఈ నెల 3వ తేదీన రాష్ట్రంలో మొత్తం విద్యుత్ డిమాండ్ 18,139 మెగావాట్లకు చేరి కొత్త రికార్డు నమోదు చేసింది. అదే సమయంలో టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో శుక్రవారం గరిష్ట డిమాండ్ 11,129 మెగావాట్లు నమోదైంది. గత ఏడాది ఇదే రోజున ఈ డిమాండ్ 10,310 మెగావాట్లుగా ఉండగా, ఈసారి అది గణనీయంగా పెరగడం విశేషం.

గ్రేటర్ పరిధిలోను భారీగా పెరిగిన డిమాండ్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఈ నెల 3న అక్కడ 4,421 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. రబి పంటల సాగు కొనసాగుతున్న జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ వినియోగం అధికంగా ఉండటంతో పాటు ఎండల కారణంగా గృహ వినియోగం కూడా పెరుగుతోంది. జిల్లాల వారీగా కూడా డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గరిష్ట డిమాండ్ 2,459 మెగావాట్లు నమోదవగా, మహబూబ్‌నగర్ జిల్లాలో 2,326 మెగావాట్లు, మెదక్ జిల్లాలో 2,181 మెగావాట్లు నమోదయ్యాయి.

నిరంతర సరఫరాకు అన్ని చర్యలు

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు నిరంతర సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు టీజీఎస్పీడీసీఎల్ సిఎండి జితేష్ వి. పాటిల్ తెలిపారు. 33 కేవీ, 11 కేవీ ఫీడర్లు, సబ్‌స్టేషన్లలోని పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల లోడును నిరంతరం పర్యవేక్షించాలని క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

Next Story